వ్యతిరేక వార్తలకు స్థానమే లేదు! కేంద్రంలోని మోడీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కి గానీ, ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ-బీజేపీల కూటమికి గానీ, తెలంగాణలో అధికారంలో ఉన్న తెరాసకు గానీ వ్యతిరేకంగా ఎలాంటి వార్తలు, విశ్లేషణలు ఉండవు లార్జెస్ట్ సర్కులేటెడ్ డెయిలీలో. ఈ విషయంలో అనేక విమర్శలు వచ్చినా.. ఆ పత్రిక వాటిని పట్టించుకోవడం లేదు. మరి అధికారంలో ఉన్న వారు అనేక పొరపాట్లు చేసే అవకాశం ఉంది, ఎవరి పాలనలో అయినా బోలెడన్నిలోటు పాట్లు ఉంటాయి. అలాంటి వాటిని ఎండగట్టడమే మీడియా పని.
కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కొన్ని తెలుగు మీడియా వర్గాలు ఈ పనిని గట్టిగా చేస్తాయి. అయితే తమకు అనుకూలమైన ప్రభుత్వాలు, తాము మెచ్చిన ప్రభుత్వాలు ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి పనికి పూనుకోవు. అందుకు అనేక ఆధారాలు కనిపిస్తాయి. ఈ మధ్య కాలంలో ఈనాడు పత్రికలో ప్రచురితమైన కొన్ని కొ్న్ని వార్తలు చూస్తుంటే.. మోడీ, చంద్రబాబులకు దెబ్బ లు తగలకుండా ఈ పత్రిక ఇంతగా కష్టపడుతోందా? అనే సందేహం వ్యక్తం అవుతోంది!
ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ విషయంలో మోడీ ప్రభుత్వానికి కోర్టులో తగిలిన ఎదురుదెబ్బకు జాతీయ మీడియా కూడా చాలా ప్రాధాన్యతను ఇచ్చింది. మోడీకి ఇదో సెట్ బ్యాక్ గా అభివర్ణించింది జాతీయ మీడియా. అయితే ఈనాడులో మాత్రం ఆ వార్తను చాలా సున్నితంగా రాశారు. కోర్టు వ్యాఖ్యలను డైరెక్టుగా రాస్తే మోడీకి ఎక్కడ చెడ్డపేరు వస్తుందో అనేభయం కనిపిస్తుంది ఆ వార్త చదివితే. అలాగే విజయవాడలో ఆసుపత్రి నుంచి పసిపిల్లాడిని ఎత్తుకుపోయిన వార్తకు కూడా చాలా లైటర్ వెయిన్ లో ప్రజెంట్ చేశారు. బుడ్డోడిని బూచోడెత్తుకెళ్లాడని.. ఏదో చందమామ కథ టైపులో రాశారు! తీవ్రమైన అంశం తీవ్రతను అలా తగ్గించే యత్నం చేశారు. ఇదంతా మోడీ, చంద్రబాబు లకు ప్రజల్లో ఎలాంటి చెడ్డపేరూ రాకుండా చేస్తున్న యత్నమే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.. ఆ పత్రిక పాఠకుల నుంచి!