కరోనా దెబ్బ మీడియాపై గట్టిగా పడింది. వందలాది ఉద్యోగాలు ఊడిపోయాయి. జీతాలు కట్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాలో తిరుగులేని `ఈనాడు` సైతం కరోనా ధాటికి విలవిలలాడుతోంది. దిగువ స్థాయి ఉద్యోగుల్ని ఇప్పటికే ఇంటికి పంపింది ఈనాడు. రిటైర్మెంట్ తరవాత కూడా కొనసాగుతున్న సీనియర్లనూ మర్యాదగా సాగనంపింది. ఇప్పుడు లేటెస్టుగా సగం రోజుల పని – సగం రోజులు సెలవు అంటూ కొత్త విధానాన్ని ప్రవేశ పెట్టి, ఆ విధంగానూ జీతాలు కట్ చేస్తోంది.
ఇప్పుడు ప్రింటింగ్ పూర్తిగా మానేసి – కేవలం ఈ- పేపర్‌పై దృష్టి పెడితే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తోంది. కరోనా వల్ల.. ఈనాడు సర్క్యులేషన్ బాగా పడిపోయింది. ఈనాడు అనే కాదు.. మిగిలిన పేపర్ల పరిస్థితి కూడా ఇంతే. పాఠకులు ఈ – పేపర్‌కి బాగా అలవాటు పడుతున్నారు. యాడ్లు లేకపోవడంతో ప్రింటింగ్ ఖర్చు భరించడానికి యాజమాన్యాలు సిద్ధంగా లేవు. ఇటీవల జరిగిన కీలకమైన సమావేశంలో ప్రింటిగ్పై దృష్టి తగ్గించి, ఈ పేపర్ మరింత మందికి చేరువ అయ్యేలా చూడమని రామోజీరావు ఆదేశించారని, ఒక దశలో ప్రింటింగ్ ఆపేయాలన్న నిర్ణయానికి వచ్చారని, కానీ… చివరి నిమిషంలో ఆ ప్రతిపాదన పక్కన పెట్టారని, కొంతకాలం వేచి చూసి, ఆ తరవాత నిర్ణయం తీసుకుందామని కిరణ్ లాంటి వాళ్లు సర్ది చెప్పారని తెలుస్తోంది. ఒకట్రెండు నెలలు వేచి చూసి, పరిస్థితి మెరుగు పడకపోతే… ప్రింటింగ్‌ని పూర్తిగా పక్కన పెట్టాలని ఈనాడు యోచిస్తోంది. ఈలోగా యాప్స్, ఈపేపర్ని జనంలోకి బాగా తీసుకెళ్లే ప్రయత్నాలు మొదలెట్టారు. మీడియా సంస్థల్లో దిగ్గజం లాంటి ఈనాడు ఇలాంటి ఆలోచనల్లో ఉందంటే.. మిగిలిన పేపర్లూ అదే బాట పట్టడం ఖాయం.