సాక్షి పత్రికకు.. నిబంధనలకు విరుద్ధంగా.. ప్రకటనలు, సాక్షి మీడియా సిబ్బందికి అనధికారికంగా ప్రజాధనం జీతాల రూపంలో చెల్లిస్తున్నారనే ఆరోపణలు .. తీవ్రంగా వస్తున్న సమయంలో.. అనూహ్యమైన మార్పు చోటు చేసుకుంది. ఆరోగ్యశ్రీ చికిత్సలు చేసుకున్న వారికి నెలవారీగా రూ. ఐదు వేలు సాయం అందించే పథకానికి జగన్ నేడు శ్రీకారం చుడుతున్నారు. ఈ సందర్భంగా… ఈనాడు పత్రికకు.. ఫ్రంట్ పేజీ.. ఫుల్ పేజీ యాడ్ ఇచ్చారు. అదీ కూడా… ఏపీ ఒక్క ఎడిషన్‌కు మాత్రమే కాదు.. తెలంగాణ, హైదరాబాద్ ఎడిషన్లకు కూడా యాడ్స్ ఇచ్చారు. గత ఆరు నెలల కాలంలో… ప్రభుత్వం తరపున అనేక కార్యక్రమాలకు… పెద్ద ఎత్తున పత్రికలకు ప్రకటనలు ఇచ్చారు. కానీ.. ఈనాడుకు.. ఎప్పుడూ.. ఏపీ ఎడిషన్‌కు మాత్రమే ప్రకటనలు ఇచ్చారు. ఈ సారి మాత్రం.. తెలంగాణ, హైదరాబాద్ ఎడిషన్లకు ఇచ్చారు.
ఈ ప్రకటనల్లో మరో విచిత్రం ఏమిటంటే… సాక్షి పత్రికకు.. హాఫ్ పేజీ ప్రకటనలు మాత్రమే ఇచ్చారు. ఈ ఆరు నెలల కాలంలో.. సాక్షి పత్రికకు అన్ని పత్రికల కన్నా అగ్రప్రాధాన్యం లభించింది. ఫుల్ పేజీ ప్రకటనలు…అన్ని ఎడిషన్లలో ప్రకటనలు కామన్ గా కనిపించింది. ఈనాడుకి డబుల్ ప్రకటనలు ఉండేవి. కానీ.. ఈ సారి మాత్రం.. అంచనాలు తలకిందులు చేశారు. హాఫ్ పేజీ ప్రకటన మాత్రమే.. మూడు ఎడిషన్లకు ప్రభుత్వం తరపున సాక్షికి ఇచ్చింది. ఎప్పటిలాగే.. ఆంధ్రజ్యోతికి మాత్రం ఎలాంటి ప్రకటనలు ఇవ్వలేదు.
మీడియాకు ప్రకటనలు జారీ చేయడానికి.. కొన్ని నిబంధనలు ఉంటాయి. అడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యూలేషన్ నిర్ధారించిన లెక్కల ప్రకారం… ప్రకటనలు ఇవ్వాలి. కానీ గత ఆరు నెలల్లో ప్రభుత్వం అవేమీ పట్టించుకోలేదు. పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని సాక్షికి ప్రకటనల రూపంలో చెల్లించారు. ఎవరైనా ఈ అవకతవకలను ప్రశ్నిస్తూ.. కోర్టుకు వెళ్తే.. ప్రభుత్వం సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. అదే సమయంలో.. సాక్షి ప్రకటనల ధర రెండింతలు చేశారు. దీంతో.. సాక్షి నిర్వహణ వ్యయం అంతా.. ప్రజాధనమేనన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు.. ఈనాడుకి ఫుల్ పేజీ ప్రకటన ఇచ్చి.. సాక్షికి హాఫ్ పేజీ ఇచ్చినా… చెల్లించే సొమ్ములో తేడా లేదని.. ఈనాడు కంటే ఎక్కువే.. సాక్షికి చెల్లిస్తారన్న అంచనాలున్నాయి.