జగన్ రెడ్డి పుణ్యం.. ఐదేళ్లుగా రాజధాని లేని రాష్ట్రంగా అప్రతిష్టపాలైంది ఆంధ్రప్రదేశ్. అమరావతిని నిర్లక్ష్యం చేసిన పాపం.. జగన్ రెడ్డి ప్రభుత్వానిదే. ఇప్పుడు అమరావతిని పునరుద్ధరించుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. తలో చేయీ వేసి, అమరావతి పునః నిర్మాణానికి పాటు పడాల్సిన తరుణం వచ్చేసింది. అందులో భాగంగా ఈనాడు తొలి అడుగు వేసింది. రామోజీరావు సంస్మరణ సభను పురస్కరించుకొని, ఈనాడు తరపున రూ.10 కోట్ల భారీ విరాళాన్ని ఆ సంస్థ ప్రకటించింది. ఇది ఆరంభం మాత్రమే. అమరావతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఆంధ్రులందరిదీ. ఈనాడు వేసిన బాటలో మిగిలిన వ్యాపారవేత్తలు, సంస్థలు, సామాజిక వేత్తలు, ముఖ్యంగా సినిమా వాళ్లూ నడవాలి. తలో చేయీ వేయాలి.
గత ప్రభుత్వ వైఫల్యాలూ, అసమర్థ పాలన, బటన్ నొక్కుడు కార్యక్రమాల ద్వారా చాలా వరకూ ప్రజాధనం వృధా అయ్యింది. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. టీడీపీ ప్రభుత్వంపై చాలా బాధ్యత ఉంది. పాలన గాడిలో పెట్టడం ఒక ఎత్తయితే… అమరావతిని పునః నిర్మించడం మరో పెద్ద పని. ఉన్న పరిమిత వనరుల్ని ఉపయోగించుకొంటూ, ఈమహా యజ్ఞం కొనసాగించడం అంత సులభం కాదు. ఇలాంటి తరుణంలోనే అంతా తమ వంతు సాయం అందించాలి. ముఖ్యంగా స్టార్లు ముందుకు రావాలి. తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ఉపద్రవం ఎదురైనా సినిమావాళ్లు మేమున్నాం అంటూ ముందుకొచ్చారు. తమ వంతు సాయం అందించారు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి. బడా నిర్మాతలు, అగ్ర హీరోలు అనుకొంటే – అమరావతికంటూ ఓ ప్రత్యేకమైన నిధి ఏర్పాటు చేయడం పెద్ద కష్టమేం కాదు. మరి అలాంటి ప్రయత్నాలేమైనా జరుగుతాయేమో చూడాలి.