మోడీకి చంద్రబాబుకు నొప్పి కలగనివ్వని ఈనాడు అంటూ తెలుగు360లో పోస్టు చూసిన కొందరు మీడియా మిత్రులు పాఠకులు కూడా ఈ జాబితాలో కెసిఆర్నూ జోదించాలని ఫోన్లు చేస్తున్నారు. నిజానికి ఈ త్రినేతల సేవలో ఈనాడు గతంలోని పదును కోల్పోయిందనీ పలచబడిందనీ రోజూ విమర్శలు వస్తున్నాయి. అత్యధిక సర్క్యులేషన్ విస్తారమైన యంత్రాంగం వుండటం వల్ల తప్ప గతంలో వలె వ్యాఖ్యలు పరిశోధనా కథనాల కోసం దాన్ని చూసే పరిస్థితి లేదని మామూలు పాఠకులు పసిగడుతున్నారు. జగన్ రామోజీ భేటీ తర్వాత ఆయనపైనా కథనాలు బాగా తగ్గాయి. నిజానికి వీరందరి విషయంలో ఎప్పుడైనా కొన్ని విమర్శలు వస్తాయేమో గాని కెసిఆర్‌ను టిఆర్ఎస్ను నొప్పించే వార్తలు వ్యాఖ్యలు ససేమిరా కనిపించడం లేదు. ఆయన రోజూ జరిపే సమీక్షా సమావేశాలకే విద్యల వెలుగులు,విద్యుత్ శోభలు, రైతుకు చేయూత, పట్టణాలకు పట్టాభిషేకం వంటి అందమైన పదాలతో అగ్రభాగాన ఇవ్వడం అలవాటైపోయింది. మొక్కల పెంపకం వంటి మామూలు కార్యక్రమంపైపే పేజీ ఇంటర్వ్యూ ప్రచురించింది. తమాషా ఏమంటే ఆ పథకంలో వున్న విమర్శలూ గతానుభవాలకు సంబంధించిన విమర్శనాత్మక ప్రశ్నలు నామకార్థమే. అంతా అతిశయమే. రాశులు నక్షత్రాలపేరిట మొక్కట పంపకంపై విమర్శలను గురించి అడిగింది లేదు.(పైగా ఆయన కుటుంబ సభ్యుల రాశులు నక్షత్రాల వారిగా పెద్ద వార్త అందరితోపాటు ఇచ్చింది) పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులను తొలగింపు కేసుల బనాయింపు గురించిన వార్తలు చాలా వున్నా మాటవరసకైనా వాటిని అడిగింది లేదు. ఒకప్పటి ఆకాశవాణి దూరదర్శన్లలా ఈనాడు తయారైందనే మాట మరింత బలపడటానికే ఇలాటి భజనలు దారితీస్తాయి మరి.