ఈరోజు అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి. ఓ మహానటుడి ప్రయాణంలో, ప్రస్థానంలో శతాబ్ద కాలం పూర్తయ్యింది. ఓరకంగా తెలుగు చిత్రసీమ పండగలా జరుపుకోవాల్సిన తరుణం ఇది. అయితే ఏపీలో పరిస్థితులు ఇప్పుడిప్పుడే చక్కబడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వానికి ‘సినిమా’పై ధ్యాస పెట్టేంత సమయం లేకుండా పోయింది. అభిమానులు, మీడియానే అక్కినేని శత జయంతి వేడుకలు జరుపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
సాధారణంగా ‘ఈనాడు’లో ఇలాంటి ప్రత్యేకమైన సందర్భాల్లో కవరేజ్ బ్రహ్మాండంగా ఉంటుంది. మిగిలిన పత్రికలకు పోటీగా సినిమా పేజీని తీర్చిదిద్దుతుంటారు. కానీ అక్కినేని నూరవ జయంతిని ఈనాడు పూర్తిగా విస్మరించింది. ఈనాడు పత్రిక తిరగేస్తే.. ఒక్కటంటే ఒక్క ఆర్టికల్ కూడా లేదు. కనీసం ఏఎన్నార్ ఫొటో కూడా లేదు. ఓ మహానటుడిని స్మరించుకోవాల్సింది ఇలాగేనా?
సాక్షి ఈ విషయంలో చాలా ముందుంది. తన ఫ్యామిలీ పేజీ మొత్తాన్ని అక్కినేనికి కేటాయించింది. ‘మా కళ్లు చెబుతున్నాయి నిను ప్రేమించామని’ శీర్షికపై అలనాటి కథానాయికలు శారద, లక్ష్మి, షావుకారు జానకి, రోజారమణి, మీనాలకు అక్కినేనితో ఉన్న అనుబంధానికి అక్షరరూపం ఇచ్చింది. అక్కినేని పై ఓ ఫజిల్ కూడా పెట్టింది. ఆంధ్రజ్యోతి సినిమా పేజీ కూడా తక్కువ చేయలేదు. ‘బాటసారి.. నిను మరువమోయి’ అంటూ అక్కినేనిని ఈతరం గుర్తు చేసుకొనే ప్రయత్నం చేసింది. కానీ అగ్ర పత్రిక ‘ఈనాడు’ మాత్రం రిక్త హస్తాలతో నిరాశ పరిచింది.
మహా నటీనటులకు సంబంధించి జయంతి, వర్థంతి లాంటి సందర్భాలు వచ్చినప్పుడు పుంఖాను పుంఖాలుగా రాసే ఈనాడు.. అక్కినేని శత జయంతిని పట్టించుకోకపోవడం అక్కినేని అభిమానుల్ని విస్మయానికి గురి చేస్తోంది. మరి ఈనాడుకు ఏమైందో?!