ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి అనే పేరును సూచించింది..రామోజీరావు. ఈ విషయాన్ని స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే.. అసెంబ్లీలో చెప్పారు. అలాంటి అమరావతిని రాజధాని కాకుండా చేస్తూంటే..తరలిస్తూంటే.. ఈనాడు సైలెంట్ గా ఉంటుందా..?. ఉండలేదు..అని అని విశాఖ రాజధానిని కూడా వ్యతిరేకించలేదు. అందుకే.. ఈనాడు మార్క్ ని కొత్తగా చూపించడం ప్రారంభించారు. ఎక్కడా రాజధాని మార్పునకు వ్యతిరేకంగా కథనాలు రాయడం లేదు. విశాఖలో రాజధాని మంచిది కాదని చెప్పడం లేదు. కానీ.. రాజధాని మార్పు అనేది మాత్రం.. మంచి నిర్ణయం కాదని.. ప్రజాధనం దుర్వినియోగం.. ప్రజలకు దూరాభారం అని మాత్రం.. ప్రజల్లోకి స్పష్టమైన సమాచారాన్ని మాత్రం పంపుతున్నారు.
ఈనాడు నాలుగు రోజుల కిందట… విశాఖ రాజధాని అయితే.. సీమ వాసులకు ఎంత దూరమవుతుందో.. వివరిస్తూ. .. ఫుల్ పేజీ కథనం ప్రచురించారు. అందులో ఎక్కడా రాజధాని మార్పుకు అనుకూలమా.. వ్యతిరేకమా..లాంటి వ్యాఖ్యలు లేవు. కేవలం దూరాభారం గురించి మాత్రమే రాశారు. అది రాయలసీమలోనే కాదు.. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ చాలా ఇంపాక్ట్ చూపించింది. అప్పట్నుంచి సీమలో రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా ప్రకటనలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత “అన్నీ అమరిన రాజధాని” అని మరో ఫుల్ పేజీ కథనం ప్రచురించారు. అమరావతిలో ఏమీ లేవు ..అందుకే తరలిస్తున్నారన్న అపోహల్ని ఈ కథనం తుడిచేసే ప్రయత్నం చేసింది. అన్నీ అమరావతి నుంచే జరుగుతున్నాయని గుర్తు చేసింది. ఇప్పటికిప్పుడు విశాఖకు వెళ్తే మళ్లీ అన్నీ అక్కడ సిద్ధం చేసుకోవాలని కూడా ప్రజలకు చెప్పింది. శుక్రవారం కొత్తగా రాజధాని అన్న కారణంగా కట్టుకున్న భవనాలు..వాటి విశిష్టతల గురించి రాశారు. అవన్నీ.. వృధా పోతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
రాజధాని తరలిస్తే.. ఆర్థికంగా ప్రజాధనం ఎంత నష్టమో…పక్కాగా లెక్క కట్టి మరీ.. ఈనాడు చెబుతోంది. అయితే.. అది నేరుగా చెప్పడం లేదు. ఎంత ఖర్చు అయిందో మాత్రమే చెబుతోంది. కొద్ది రోజుల క్రితం.. రాజధానికి రూ. పదివేల కోట్లకుపైగా ఖర్చయ్యాయని.. వివరాలు వెల్లడించిన ఈనాడు.. ఆ పదివేల కోట్ల ఖర్చుకు తగ్గట్లుగా… కథనాలు ప్రచురిస్తోంది. అంత ప్రజాధానం వృధా అనే భావన ప్రజల్లో ఏర్పడేలా చేస్తోంది. నిజంగానే ఈ కథనాలు .. ప్రజల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. అందుకే వైసీపీ నేతలు.. ఈనాడుపై తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు. ఈనాడు కుట్ర చేస్తోందని అంటున్నారు. నిజానికి ఈనాడు ఉన్నది ఉన్నట్లుగానే చెబుతోంది. అది వైసీపీ సర్కార్ కు కుట్రలా కనిపిస్తోంది.