తెలుగులో అగ్రగామి దినపత్రిక ఈనాడు. దశాబ్దాలుగా నెంబర్ వన్‌గా చలామణీ అవుతోంది. అయితే… కరోనా నేపథ్యంలో నెంబర్ వన్ సంస్థ సైతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కరోనా ఉపద్రవానికి ముందు ఈనాడు సర్క్యులేషన్ దాదాపు 18 లక్షల వరకూ ఉండేది. ఆదివారం వచ్చిందంటే మరో 2 లక్షలు అదనం. అయితే.. అది ఇప్పుడు 10 లక్షలకు పడిపోయింది. సర్క్యులేషన్ పడిపోవడం అటుంచితే… ఈనాడునే స్వయంగా ప్రింటింగ్ తగ్గించేసింది. డిమాండ్ కంటే.. తక్కువ ప్రింట్ చేయడానికే మొగ్గు చూపిస్తోంది. ఒక్కోసారి..9 లక్షల కాపీలే ప్రింట్ చేస్తున్నట్టు సమాచారం. ఈనాడుకి లూజ్ సేల్స్ చాలా ఎక్కువ. రైల్వే స్టేషన్లలోనూ, కిళ్లీ షాపుల్లోనూ ఈనాడు ఎక్కువగా దర్శనమిస్తుంది. కరోనా భయంతో పాఠకులు దిన పత్రికలు కొనడం తగ్గించేశారు. చందాదారులు కూడా క్రమంగా తగ్గిపోతూ వస్తున్నారు.
మరోవైపు యాడ్ల ద్వారా వచ్చే ఆదాయం పూర్తిగా పోయింది. ఇది వరకు నెలకు కేవలం యాడ్ల ద్వారా వంద కోట్లు వస్తే.. ఇప్పుడు నెలకు రెండు, మూడు కోట్లకు మించడం లేదని తెలుస్తోంది. దీన్ని బట్టి… ఈనాడు ఆదాయానికి ఎంత గండి పడిందో అర్థం చేసుకోవొచ్చు. మరోవైపు ప్రభుత్వ ప్రకటనలూ బాగా తగ్గిపోయాయి. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వానికి ఈనాడు చాలా ఫేవర్. అయినప్పుటికీ కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రకటనలు బాగా తగ్గిపోయాయి. దాంతో పోలిస్తే.. జగన్ ప్రభుత్వమే ఈనాడుకు యాడ్లు బాగా ఇస్తోందట. కరోనా కారణంగా.. ఆ ప్రకటనలూ రావడం లేదు.
పేపర్ ప్రింటింగ్ తాత్కాలికంగా ఆపి, ఈ పేపర్ని పాఠకులకు చేరువ చేయాలని రామోజీరావుకి ప్రధాన ఉద్యోగ బృందం సలహా ఇచ్చింది. అయితే.. రామోజీ అందుకు ఒప్పుకోలేదు. ప్రింటింగ్ ఆపితే.. పాఠకులు శాశ్వతంగా దూరమయ్యే ప్రమాదం ఉందని ఆ ప్రతిపాదన పక్కన పెట్టారు. కానీ.. ఇప్పుడు ఈ విషయంలో పునరాలోచించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు టాక్. ఇప్పటికే ఈనాడు నుంచి వచ్చే సితార, విపుల, చతుర, బాలభారతం, తెలుగు – వెలుగు పత్రికలు డిజిటల్ వెర్షన్‌కి మారాయి. ఈనాడు పేజీల సంఖ్య సగానికి సగం తగ్గింది. జిల్లా ఎడిషన్లు లేవు. గతంతో పోలిస్తే డిజిటల్ పేపర్ చదివేవాళ్ల సంఖ్య 30 శాతం పెరిగిందని సమాచారం. అందుకే… ప్రింటింగ్ పూర్తిగా ఆపేసి, కేవలం డిజిటల్ వెర్షన్‌కి మారాలన్న ఆలోచన ఉంది.
మిగిలిన దిన పత్రికలకూ ఇదే సమస్య ఉంది. కానీ.. ఆయా సంస్థలకు వచ్చే వేర్వేరు ఆదాయ వనరుల్ని పత్రికవైపు మళ్లిస్తున్నారు. కానీ రామోజీరావుకి లెక్కంటే లెక్కే. ఈనాడు నుంచి ఎంతొస్తుంది? ఎంత ఖర్చు పెడుతున్నాం? అనేదే ఆలోచిస్తారాయన. ఒక సంస్థ నుంచి వచ్చే లాభాల్ని మరో సంస్థ నష్టాల్ని పూడ్చడానికి అస్సలు ఇష్టపడరు. అందుకే ఈనాడు పూర్తిగా నష్టాల ఊబిలో కూరుకోకముందే… ఓ నిర్ణయానికి రావాలని అనుకుంటున్నార్ట. ఇప్పటికే ఉద్యోగుల్ని కుదించారు. జీతాల కోత విధిస్తున్నారు. ఇక ప్రింటింగ్ కూడా ఆపేస్తే… ఖర్చు సగానికి సగం తగ్గిపోతుంది. కాకపోతే.. డిజిటల్ వెర్షన్ తో ఎంత వరకూ నెట్టుకురాగలం? ఊర్లలో ఉన్నవాళ్లకు, టెక్నాలజీ అందుబాటులో లేని వాళ్లకు, సంప్రదాయ పాఠకులకు ఈ – పేపర్ ఎంత వరకూ చేరువ అవుతుంది? అనే సంశయం ఉంది. మరి… రామోజీ నిర్ణయం ఎటు వైపో చూడాలి.