రామోజీరావు దత్తపుత్రుడి హోదా అనుభవించిన శ్రీధర్.. ఈనాడు వదిలి వెళ్లిపోయారు. దానికి కారణాలు అనేకం. కాకపోతే… ఇప్పుడు ఈనాడుకి శ్రీధర్ స్థానాన్ని భర్తీ చేసే కార్టూనిస్ట్ కావాలి. శ్రీధర్ వెళ్లినప్పటి నుంచీ పాకెట్ కార్టూన్లు రావడం లేదు. ఓరకంగా పాకెట్ కార్టూన్లు లేకపోవడం ఈనాడు సంప్రదాయ పాఠకులకు రుచించడం లేదు. ఏళ్ల తరబడి అలవాటు పడిపోయారు కదా? వాళ్లంతా మళ్లీ పాకెట్ కార్టూన్ రావాలని కోరుకుంటున్నారు.
ఈనాడు కూడా అదే ప్రయత్నంలో ఉంది. మరో శ్రీధర్ ని తయారు చేయడానికి అహర్నిశం కష్టపడుతోంది. సంస్థలో ప్రతిభావంతులైన కార్టునిస్టులకు కొదవ లేదు. వాళ్లందరినీ జల్లెడ పట్టి, అందులో కొంతమందిని ఎంపిక చేసుకుంది యాజమాన్యం. వాళ్ల పనేంటంటే.. రోజూ కరెంట్ ఎఫైర్స్ కి తగ్గట్టుగా కార్టున్లు వేయడం. పదుల సంఖ్యలో వాళ్లతో కార్టున్లు వేయించి, వాటిని నిశితంగా పరిశీలిస్తోంది యాజమాన్యం. ఆ కార్టూన్లు ఏవీ బయటకు రావడం లేదు. జస్ట్… అదో పైలెట్ ప్రాజెక్ట్ అన్నమాట. శ్రీధర్ వేసిన కార్టూన్లపై అంతిమ నిర్ణయం.. రామోజీరావుదే. ఈసారీ అంతే.. ఈ కార్టూన్లన్నీ పెద్దాయన దగ్గరకు వెళ్తున్నాయి. ఆయన వాటిని పరిశీలించి, ఎవరి గీత, ఎవరి రాత బాగుందో – లెక్కలేస్తున్నారు. ఈ తతంగం ఎప్పుడు పూర్తవుతుందో తెలీదు. శ్రీధర్ స్థానంలో కార్టూన్ వేయడానికి అర్హుడైన ఆర్టిస్ట్ దొరికేంత వరకూ ఇదే తంతు. ఒకవేళ.. శ్రీధర్ స్థానాన్ని ఇచ్చేంత స్కిల్ ఎవరిలో కనపడకపోతే.. అసలు పాకెట్ కార్టూనే వద్దని పెద్దాయన గట్టిగా చెప్పాడట. అసలు తమ కార్టూన్ పబ్లిష్ అవుతందో, లేదో తెలీక.. ఎందుకోసం, ఎవరి కోసం కార్టున్లు గీయాలో అర్థం కాక.. కార్టునిస్టులంతా తలలు పట్టుకుంటున్నారు. ఈ ప్రహసనం ఎప్పుడు పూర్తవుతుందో, ఈనాడులో పాకెట్ కార్టూన్ ఎప్పుడు చూస్తామో.?