లాక్ డౌన్ తో ప్రింట్ మీడియా విలవిల్లాడుతోంది. ఇప్పటికే వందల ఉద్యోగాలు పోయాయి. జీతాలు ఆలస్యం అవుతున్నాయి. ఎప్పుడూ టంచనుగా ఒకటో తారీఖులోపే జీతాలు వేసే `ఈనాడు` ఈసారి 10వ తారీఖున వేస్తామని ఉద్యోగులకు ముందే హింట్ ఇచ్చేసింది. దాన్ని బట్టి మీడియా పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవొచ్చు. ఈనాడుతో సహా.. దిన పత్రికల సైజు బాగా తగ్గిపోయింది. నిజానికి లాక్ డౌన్ సమయంలో ప్రింటింగ్ ఆపాలని, కేవలం ఆన్ లైన్ ఎడిషన్ కే పరిమితమవ్వాలని యాజమాన్యాలు భావించాయి. కానీ..అలా చేస్తే పాఠకులు ఆన్ లైన్ కే అలవాటు పడతారని భయపడ్డాయి. అయితే ఇప్పుడు ఆన్ లైన్ ఎడిషన్లకే యాజమాన్యాలు మొగ్గు చూపిస్తున్నారని తెలుస్తోంది.
ఈ విషయంలో ఈనాడు ముందే మేల్కొంటోంది. ఈనాడు కొంతకాలం ఆన్ లైన్ ఎడిషన్కే పరిమితం కానున్నదని సమాచారం అందుతోంది. కారణాలు కూడా చాలానే ఉన్నాయి. ఈనాడులో ఉద్యోగాల కోత ఎప్పుడో మొదలైంది. లక్షల్లో జీతాలు అందుకుంటున్న సీనియర్లని చాలామందిని ఇంటికి పంపించేసింది. ఏప్రిల్ 30తో పదవీ విరమణ చేసిన ఉద్యోగుల సంఖ్య పదుల సంఖ్యలో ఉంది. దానికి తోడు `ఈనాడు` కార్డు కూడా మారబోతోందని టాక్. ఈనాడులో రెండు రకాల ఉద్యోగులు ఉన్నారు `ఈనాడు`, `ఈనాడు డిజిటల్` పేరుతో ఉద్యోగాలు చేస్తున్నారు. ఈనాడు డిజిటల్ తో పోలిస్తే.. ఈనాడుకే వేతనాలు ఎక్కువ. అయితే ఇప్పుడు ఈనాడు పూర్తిగా తొలగించి, అందరినీ ఈనాడు డిజిటల్ లోకి తీసుకురావాలని యాజమాన్యం భావిస్తోంది. అందుకోసం కొంత సమయం పడుతుంది. అందుకే.. కొంతకాలం ఈనాడు ప్రింటింగ్ని ఆపేయాలని యాజమాన్యం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఉద్యోగుల మార్పు ఓ కొలిక్కి వచ్చేంత వరకూ ఈనాడు పేపర్ రాకపోవొచ్చు.