తెలుగు రాష్ట్రాలలో అత్యధిక సర్క్యులేషన్ ఉన్న పత్రిక ‘ఈనాడు’. దశాబ్దాలుగా ‘ఈనాడు’ స్థానం చెక్కు చెదరలేదు. ‘ఈనాడు’ ఏం చేసినా, ఏం చెప్పినా ఓ విశ్వసనీయత ఉంటుంది. మిగిలిన పత్రికలకు దిక్చూచీగా మారిన ఈనాడు.. ఓ విషయంలో మాత్రం వెనుకబడింది. ప్రధాన పత్రికలన్నీ ఏదో ఓ పేరు చెప్పి అవార్డులు ఇస్తుంటే ఈనాడు మాత్రం అలాంటి ప్రయత్నం ఇప్పటి వరకూ చేయలేదు. అయితే తొలిసారి ‘ఈనాడు’ అవార్డులు ఇవ్వడం మొదలెట్టింది. రేపు (శుక్రవారం) ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఈనాడు ఓ అవార్డు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనుంది. వివిధ రంగాలలో ప్రతిభను కనబర్చిన దాదాపు 40 మంది మహిళలకు అవార్డులు ఇవ్వబోతోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ అవార్డు కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు. సినిమా, టీవీ, స్పోర్ట్స్, రాజకీయం, రచన, సేవ ఇలా దాదాపు అన్ని రంగాల్లోనూ విశిష్ట సేవలు అందించిన వాళ్లకు ఈ అవార్డులు ప్రదానం చేయనున్నారు.
నిజానికి అవార్డు కార్యక్రమం ఈనాడుకి కొత్తకాదు. ఇదివరకెప్పుడో ‘సితార’ పేరుతో సినిమా అవార్డుల్ని అందించింది ఈనాడు సంస్థ. మూడేళ్ల పాటు ఈ కార్యక్రమాన్ని కన్నుల పండుగలా నిర్వహించారు. ఆ తరవాత ఉషాకిరణ్ మూవీస్ స్థాపించి, ఈనాడు కూడా సినీ రంగంలో అడుగుపెట్టడం వల్ల, ఆ అవార్డు కార్యక్రమానికి పుల్ స్టాప్ పెట్టారు.