‘అరవింద సమేత’ లో సపోర్టింగ్ రోల్ చేసింది ఈషారెబ్బా. తన పాత్ర చిన్నదే. కానీ… హిట్ సినిమాలో కనిపించింది కదా, కాబట్టి, ఆ రూపంలో ఓ హిట్‌ని తన ఖాతాలో వేసుకుంది. మరోవైపు రాజమౌళి మల్టీస్టారర్ #RRR లోనూ ఈషారెబ్బా కనిపించనున్నదని, ఎన్టీఆర్ బయోపిక్‌లోనూ ఈషాకి స్థానం దక్కిందని వార్తలొచ్చాయి. వీటిపై ఈషా స్పందించింది.
”#RRR లో అవకాశం వస్తే అంతకంటే కావాల్సింది ఏముంది? నిజంగా అలాంటి ప్రతిపాదన వస్తే నేనే ముందు చెబుతా. ఎన్టీఆర్ బయోపిక్ గురించి మాత్రం నన్ను అడగొద్దు. చిత్రబృందమే ఈ విషయాన్ని ఖరారు చేస్తుంది” అంటోంది. ఈషా మాటల్ని బట్టి చూస్తే… ఎన్టీఆర్ బయోపిక్‌లో ఈషాకి స్థానం దక్కినట్టే అనిపిస్తోంది. `అరవింద సమేత`లో మరీ చిన్న పాత్ర చేశారు కదా, అది మీ కెరీర్‌కి ఉపయోగపడిందా? అని అడిగితే.. ”పాత్ర చిన్నదా, పెద్దదా అని ఆలోచించలేదు. ఎన్టీఆర్ – త్రివిక్రమ్‌ల సినిమా అది. పైగా పెద్ద బ్యానర్. అందుకే ఒప్పుకున్నా. నా కెరీర్‌కి ఎంత ఉపయోగపడుతుంది అని కూడా ఆలోచించలేదు. చాలా సంతోషంగా చేశా. నా పాత్ర నిడివి తక్కువ ఉందన్న బాధ కూడా లేదు. ఎందుకంటే అది ఎన్టీఆర్ సినిమా. జనాలు ఎన్టీఆర్‌ని చూడ్డానికి వస్తారు. నా కోసం రారు” అంటోంది. తన నటించిన ‘సుబ్రహ్మణ్యపురం’ రేపే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సుమంత్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి సంతోష్ దర్శకుడు.