ఈటల రాజేందర్ కు బీజేపీలో నిరాదరణే ఎదురవుతోంది. ఆయన గెలిస్తే తమకు ఎక్కడ అడ్డు వస్తారో అని అనుకుంటున్నారేమో కానీ ఆయన గురించి పట్టించుకోవడం మానేశారు. నామినేషన్ వేసినప్పుడు కనిపించిన కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటి నేతలు మళ్లీ కనిపించలేదు. తర్వాత నవరాత్రి దీక్ష చేసిన బండి సంజయ్ ఇంటి నుంచి కదల్లేదు. ఇప్పుడు ఆయన ఢిల్లీ పయనమయ్యారు. మరో వైపు ఈటల కు పార్టీ పరంగా సహకారం లభించకపోవడంతో అన్నీ ఆయన ఒక్కడే చేసుకుంటున్నారు.
ప్రచారం కోసం హైకమాండ్ ముఖ్య నేతలు ఎవరైనా వస్తారో లేదో క్లారిటీ లేదు. తెలంగాణ పార్టీ తరపున ఇంచార్జులుగా ప్రకటించిన వారు పండుగ పేరుతో నియోజకవర్గాన్ని వీడారు. మళ్లీ ఎప్పటికి వస్తారో స్పష్టత లేదు. ఉపఎన్నిక వస్తుందని తెలిసినా బండి సంజయ్ పాదయాత్ర చేశారు. కానీ హుజురాబాద్‌పై పెట్టిన దృష్టి మాత్రం కొంతే. అక్కడ ఇప్పటికే ప్రచారం ఊపందుకుంది. ప్రచార గడువు పట్టుమని పది రోజులు కూడా లేదు. ఈ సమయంలో ప్రచారం జోరు పెంచాల్సింది పోయి బండి సంజయ్ కూడా ఢిల్లీ వెళ్లడం ఈటల వర్గీయుల్ని నిరాశ పరుస్తోంది.
బండి సంజయ్ పాదయాత్రలో పాల్గొనేందుకు జాతీయ నేతలు తరలి వచ్చారు. కానీ ఈటల విషయంలో మాత్రం ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో ఈటల ఒంటరి పోరాటం చేస్తున్నారన్న భావన పెరిగిపోతోంది. ఇవన్నీ పట్టించుకుంటే కష్టమని..తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు ఈటల.