సంక్షేమం, అభివృద్ధి ఈ రెండూ కూడా జోడెద్దుల లాగా కలిసి మెలిసి ప్రయాణం చేస్తున్నంతసేపు ఏ దేశ ఆర్థిక పరిస్థితి అయినా బాగానే ఉంటుంది. కానీ అభివృద్ధి కుంటుపడి, సంక్షేమం మాత్రం కొనసాగితే కాలక్రమంలో ఎంత తీవ్రమైన పరిస్థితులు ఏర్పడతాయో, ఆర్థిక వ్యవస్థ ఎంతగా చిన్నాభిన్నం అవుతుందో, వెనిజులా, గ్రీస్ అనుభవాలు నిరూపించాయి. ఇప్పుడు భారతదేశంలో కూడా చాలా రాష్ట్రాలు అన్ని ఫ్రీ ఫ్రీ అంటూ విపరీతంగా సంక్షేమ పథకాలు ప్రకటిస్తున్నాయి. నిజంగా అవసరమైన వారికి మాత్రమే కాకుండా మనిషి యొక్క “ఆశ” మీద ఆడుకుంటూ ప్రజలను సోమరితనం వైపు నడిపించే ఇటువంటి పథకాలు ఎంత ప్రమాదకరమో ఒకసారి ఆ దేశాల అనుభవాలు చూస్తే అర్థమవుతుంది.
1970 లో వెనిజులా ప్రపంచపు 20 ధనిక దేశాల్లో ఒకటి. లాటిన్ అమెరికా దేశాల లోనే ధనికమైన ఈ దేశానికి ప్రధానమైన ఆదాయ వనరు క్రూడ్ ఆయిల్. అయితే దేశంలోని అసమానతలు రూపు మాపే ఉద్దేశంతో చావెజ్ అనేక సంక్షేమ పథకాలు ప్రకటించి అధికారంలోకి వచ్చాడు. కమ్యూనిస్టు చైనా, రష్యాల తరహాలో పాలన అందిస్తాం అని చెప్పాడు. దేశంలోని వ్యక్తుల వేతనాలు, ధరలు అన్నింటికి ప్రభుత్వమే రేటు నిర్ణయిస్తుంది. దీనికితోడు బోలెడన్ని సంక్షేమ పథకాలు.
ఇంకేముంది గొప్పగా గెలిచాడు. కానీ ఆ తర్వాత, ప్రభుత్వం ప్రకటించిన ధరలకి రొట్టెలు, బ్రెడ్, మిగతా నిత్యావసర పదార్ధాలు ఇవ్వలేక చాలా కంపెనీలు మూత పడి పోయాయి. పెట్టుబడులు పెట్టగలిగిన పారిశ్రామికవేత్తలు, మేధస్సు కలిగిన ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర దేశాలకు వెళ్లి పోయారు. కానీ చావెజ్ మాత్రం వెనక్కి తగ్గలేదు. సంక్షేమ పథకాలను కొనసాగించాడు. దేశంలో క్రూడ్ ఆయిల్ ద్వారా వస్తున్న డబ్బు చాలానే ఉంది. ప్రజలు కూడా సంక్షేమ పథకాలకు, పని చేయకపోయినా ప్రభుత్వం నుండి ఆసరాగా వచ్చే డబ్బుకి అలవాటుపడిపోయారు. కానీ 2010 తర్వాత, అనేక దేశాలలో ఆయిల్ నిక్షేపాలు బయట పడ్డాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ సప్లై పెరిగింది. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతూ వచ్చాయి. ఇది వెనిజులా దేశం పై తీవ్రమైన ప్రభావం చూపించింది. ప్రధానమైన ఆదాయవనరు కి గండి పడటంతో సంక్షేమ పథకాలు నిలిచిపోయాయి. సాధారణంగా మన దేశంలో ద్రవ్యోల్బణం (ధరలు పెరిగే రేటు) 10% దాటితే దేశమంతా గగ్గోలు పెడుతుంది. కానీ ఇక్కడ ద్రవ్యోల్బణం 3,73,000% కి చేరుకుంది. దేశంలోని కరెన్సీ నోట్లు చిత్తు కాగితాల మారిపోయాయి. వంటకు కావలసిన బొగ్గు కొనుక్కోవడం కంటే, అదే కరెన్సీ నోట్లను తగలబెట్టి వంట చేసుకోవడం ఉత్తమమైనదిగా మారింది. ఉచిత సబ్సిడీలు ఆగిపోవటంతో దానికి అలవాటు పడ్డ యువకులు కత్తులు, పిస్టళ్లు పట్టుకుని లూటీ చేస్తున్నారు. తిండి లేక జూ లో జంతువులన్నీ చచ్చి పోయాయి. క్రైమ్ రేట్ పెరిగిపోయింది. టూరిస్టులని ఆదేశానికి వెళ్ళవద్దని మిగతా దేశాలు హెచ్చరిస్తున్నాయి. చిన్న రొట్టేముక్క కోసం శరీరo అమ్ముకోవటానికి రాత్రంతా రోడ్ల మీద నిలుచున్న బాలికలు, కాస్త తిండి కోసం తెల్లవారు నుంచి అర్థరాత్రి వరకూ క్యూలో నిలబడే పిల్లలూ, కాలుస్తున్న సగం సిగరెట్ ఇమ్మని రోడ్ల మీద అడుక్కునే పెద్దలు, ఇలాంటి దృశ్యాలు దేశంలో సాధారణం అయిపోయాయి.
2008 అమెరికాలో వచ్చిన సబ్ ప్రైమ్ క్రైసిస్ సమయంలో గ్రీస్ దేశ పరిస్థితి కూడా ఇదే. గ్రీస్ దేశానికి కావలసిన ఆదాయం అంతా పర్యాటక రంగం నుండి వస్తుంది. పర్యాటక రంగం నుండి వచ్చే ఆదాయంతో గ్రీస్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టింది. ప్రజలలో ఉత్పాదకత పెంచకుండా, ప్రజలను సోమరి చేసే ఈ సంక్షేమ పథకాలు అమెరికాలో సంక్షోభం వచ్చిన సమయంలో దేశాన్ని ఘోరంగా దెబ్బ తీశాయి. అమెరికాలో సంక్షోభం కారణంగా అమెరికా నుండి గ్రీస్ కు పర్యాటకులు రావడం 2008లో పూర్తిగా తగ్గిపోయింది. దీంతో దేశానికి ఆదాయం లేకుండా పోయింది. అసలు సంక్షేమ పథకాలకు అలవాటుపడిపోయారు. దేశం దివాలా తీసే పరిస్థితి ఏర్పడింది.
ఈ పరిస్థితి భారత దేశానికి కూడా కొత్తేమీ కాదు. 1991 లో ఏర్పడ్డ బాలన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ సమయంలో భారతదేశం తన ఉద్యోగులకు జీతాలను కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉండేది. దానికి కారణం 1980ల నుండి 1990 మధ్యలో దేశంలో లో అనుసరించిన అస్తవ్యస్త ఆర్థిక విధానం. అయితే అదృష్టవశాత్తు 1991లో పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ లాంటి దార్శనికులు ప్రభుత్వంలో ఉండడంవల్ల, కఠినమైన నిర్ణయాలు తీసుకుని దేశాన్ని గట్టెక్కించ గలిగారు.
దేశాన్ని, రాష్ట్రాన్ని దివాలా తీయించే సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టే నాయకులను ఎన్నుకునే ముందు ప్రజలు పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే, ఇటువంటి పథకాల కారణంగా దివాలా తీసిన దేశాల సరసన చేరే పరిస్థితి మన రాష్ట్రానికి ఉత్పన్నం కావచ్చు.
– జురాన్ (@CriticZuran)