ఆంధ్రప్రదేశ్‌కు ఐపీఎల్ టీం ఎందుకు లేదన్నదానిపై గత ప్రభుత్వం వ్యవహరించిన విధానంపై అనేక సెటైర్లు సోషల్ మీడియాలో పడుతూ ఉంటాయి. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం టీము లేకపోయినా ముందుగా మ్యాచులు నిర్వహించేలా చూడాలని అనుకుంటోంది. విశాఖతో పాటు మంగళగిరి స్టేడియంలోనూ కొన్ని మ్యాచులు జరిగేలా చూడాలనుకుంటున్నారు. మంగళగిరిలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఓ స్టేడియాన్ని కట్టడం ప్రారంభించి ఏళ్లు గడిచిపోతోంది.కానీ. పనులు మాత్రం ముందుకు సాగడం లేదు.
ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున పనులు జరుగుతున్నాయి. నిర్వహణ లేక పాడైపోయిన గ్రౌండ్ ను బాగు చేస్తున్నారు. అంతర్జాతీయ మ్యాచ్‌ల నిర్వహణకు అనుగుణంగా ఉండేలా స్టేడియాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఐపీఎల్ సీజన్ వేసవిలో ప్రారంభం అవుతుంది. ఇంకా షెడ్యూల్ ను బీసీసీఐ ప్రకటించలేదు. ప్రకటించడానికి ముందు వివిధ రాష్ట్రాల క్రికెట్ సంఘాల నుంచి వివరాలు తీసుకుంటుంది. మ్యాచులు కేటాయిస్తుంది.
బీసీసీఐకి ఏసీఏ .. మంగళగిరి స్టేడియాన్ని అప్పటికల్లా రెడీ చేస్తామన్న భరోసా ఇస్తే.. ఖచ్చితంగా మ్యాచ్‌లు కేటాయించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నాయి. రెండు, మూడు మ్యాచులు జరిగినా అది అమరావతిని, నూతన ఏపీ రాజధానికి మంచి ప్రచారం తీసుకు వస్తుంది. ఇలాంటి అవకాశాలను ఏపీ ప్రభుత్వం వదులుకోదని అనుకోవచ్చు.