తెలంగాణా రాష్ట్రంలో నిన్న ఒక్కరోజునే 8 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. అందరూ అప్పుల బాధలు భరించలేకనే ఆత్మహత్యలు చేసుకొన్నారు. కరీంనగర్ జిల్లాలో అంబటి నారాయణ (40), మూసకు నాగిరెడ్డి (46), మామిడిపెల్లి రాములు, మెదక్ జిల్లాలో నల్ల కృష్ణయ్య (40), గూడూరు మల్లారెడ్డి (46), ఖమ్మం జిల్లాలో తేజావత్ మంగ్యా (36), అదిలాబాద్ జిల్లాలో జాదవ పుండలీక్ (30), వరంగల్ జిల్లాలో తడకపల్లి వెంకట నర్సయ్య (64) ఆత్మహత్యలు చేసుకొన్నారు. వీరుగాక మరో ఇద్దరు రైతులు నీళ్ళు లేక తెగుళ్ళు సోకి ఎండిపోతున్న తమ పొలాలని చూసి తట్టుకోలేక తమ పోలాలలోనే గుండె పోటుతో మరణించారు.
అందరికీ అన్నం పెట్టే అన్నదాతలు ఆర్ధిక సమస్యలతో సతమతమవుతూ ఆత్మహత్యలు చేసుకొంటుంటే తెరాస ప్రభుత్వం ఆకాశ హర్మ్యాలు, వైఫీల గురించి ఆలోచిస్తోంది. తెలంగాణా ఏర్పడితే అన్ని సమస్యలు చిటికెలో పరిష్కారం అయిపోతాయని చెప్పిన తెరాస నేతలు ఈ ఆత్మహత్యలన్నీ గత ప్రభుత్వ నిర్వాకం వలననే జరుగుతున్నాయని చెప్పి చేతులు దులుపుకోవడం చాలా విచారకరం. రైతన్నలు ఆత్మహత్యలు చూసి ప్రజల గుండెలు తరుక్కుపోతుంటే ప్రతిపక్ష పార్టీలు శవరాజకీయాలు చేస్తున్నాయి.
అటు ప్రభుత్వమూ వారిని ఆదుకోక, ఇటు ప్రతిపక్షాలు ఆదుకోకపోవడంతో రైతన్నలు తీవ్ర నిరాశ, నిస్పృహలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటువంటి సమయంలో రైతన్నలకు సమాజమే అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. రాజకీయ నాయకుల వలన కాని ఈపనిని దేశవిదేశాలలో ఉన్న తెలుగువాళ్ళు, పవన్ కళ్యాణ్ వంటి మానవతావాదులు, స్వచ్చంద సంస్థలు, కార్పోరేట్ సంస్థలు చొరవ తీసుకొని మన రైతన్నలను కాపాడుకోవాలి. లేకుంటే రాజకీయ నాయకులకీ, మనకీ తేడాయే ఉండదు.