కరోనా వైరస్ వస్తుంది.. పోతుందని.. దాని గురించి బాధపడాల్సిన పనే లేదని… అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. తాజాగా రియలైజ్ అయ్యారు. రోజుకు రెండున్నర వేల మంది చనిపోతున్న సమయంలో ఆయనకు ఈ జ్ఞానోదయం అయింది. వెంటనే.. ఆయన ఈ మేరకు కార్యాచరణ ప్రారంభించారు. “ఓపెనింగ్ అప్ అమెరికా ఎగైన్” పేరిట పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించి ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభించబోతున్నట్లుగా ప్రకటించారు. అంతే కాదు… భౌతిక దూరం నిబంధననూ పాటించబోమని చెప్పారు. అన్ని రకాల రవాణా సౌకర్యాలను పునరుద్ధరించాలని నిర్ణయించారు. వచ్చే వారం నుంచి దేశవ్యాప్తంగా సాధారణ జీవితం ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు.
కరోనా మహమ్మారి దానంతట అదే పోతుందనేది ట్రంప్ ప్రగాఢమైన విశ్వాసం. వ్యాక్సిన్‌పై ఆధారపడటం లేదని తేల్చేశారు. వ్యాక్సిన్ ఉన్నా లేకున్నా ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చాలన ట్రంప్ భావిస్తున్నారు. తాను స్వయంగా ఇతర రాష్ట్రాలకు వెళ్లాలని డిసైడయ్యారు. కరోనా మహమ్మారి అమెరికాలో ప్రభావం చూపించడం ప్రారభమైన తర్వాత వాషింగ్టన్ దాటి బయటకు వెళ్లలేదు. వైరస్ శరవేగంగా విస్తరిస్తున్నప్పటికీ.. దానంతటికి అది పోతుందని… జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం లేదన్న అభిప్రాయానికి డొనాల్డ్ ట్రంప్ రావడానికి రాబోతున్న అధ్యక్ష ఎన్నికలే కారణమని భావిస్తున్నారు.
ఎలా అయినా రెండో సారి అధ్యక్షుడిగా ఎన్నికలవ్వాలని పట్టుదలగా ఉన్న ట్రంప్ ఆశలకు.. కరోనా కష్టాలు తెచ్చి పెట్టింది. ఇట్టే గెలిచేస్తామని అనుకున్న ట్రంప్‌కు పరిస్థితులు కలసి రాలేదు. మొదట్లో పోరాడి ఇప్పుడు వైరస్ ను అలా వదిలేసి ఎన్నికల బరిలో నిలబడాలని నిర్ణయించుకున్నారు. భౌతిక దూరం పాటించబోమని.. భారీ ఎన్నికల ర్యాలీలు నిర్వహిస్తామని ప్రకటనలు చేస్తున్నారు. ట్రంప్ ప్రకటనలపై అమెరికన్లు గందరగోళానికి గురవుతున్నారు. అక్కడ కొన్ని కోట్ల ఉద్యోగాలు పోతూండటంతోప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.ఈ సమయంలో ట్రంప్..వారిని మరింత గందరగోళానికి గురి చేస్తున్నారు.