కారణాలు ఏవైనా స్థానిక ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎప్పటి వరకు అన్నదానిపై క్లారిటీ లేదు. ఇప్పటికి నాలుగు వారాలు అని ఎస్ఈసీ చెబుతోంది కానీ.. కరోనా కట్టడి అయిన తర్వాతే.. ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఎన్నికలు వాయిదానే వేశారు కాబట్టి.. ఎన్నికల కోడ్ కొనసాగుతుంది. అంటే.. ప్రభుత్వం చాలా పరిమితులకు లోబడి పని చేయాల్సి ఉంటుంది. ఓటర్లను ప్రలోభ పెట్టే ఏ కార్యక్రమమూ చేపట్టకూడదు. అందుకే.. కొత్తగా ప్రభుత్వ పథకాల పంపిణీని నిలిపివేయాలని ఎస్ఈసీ ఆదేశించింది. ఇందులో ఇళ్ల స్థలాల పంపిణీ కూడా ఉంది.
ఉగాది రోజుల ప్రభుత్వం ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే.. అదే సమయంలో.. ఎన్నికల కోడ్ అమల్లో ఉండేలా.. ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించడంతోనే ప్రభుత్వ చిత్తశుద్ధిపై సందేహాలు వచ్చాయి. దానికి తగ్గట్లుగానే… ఇళ్ల స్థలాల పంపిణీ వద్దని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు జరిగి ఉంటే… కనీసం.. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అయినా.. ఇళ్ల పట్టాల పంపిణీ జరిగి ఉండేది. కానీ.. ఇప్పుడు.. ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీంతో ఆ కార్యక్రమం ఆగిపోయింది. దానితో పాటు అనేక పథకాలు.. నిలిచిపోనున్నాయి. పించన్లు, రేషన్ బియ్యం వంటి.. పాత పథకాలు మాత్రం.. యథావిధిగా కొనసాగుతాయి.
ప్రభుత్వం .. స్వేచ్చగా పని చేయడానికి లేదు. ఎన్నికల కోడ్ ను పట్టించుకోకుండా.. అన్ని పనులు చేయడానికి అవకాశం లేదు. ప్రభుత్వం చేయాలనుకున్నా… అధికారులు సందేహించే అవకాశం ఉంది. ఎందుకంటే.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు… ఏ పని చేసినా.. నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. అసలు ప్రభుత్వం చెప్పినపని చేయడం కన్నా… ఈసీ చెప్పిన పనే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈసీకి, ప్రభుత్వానికి మధ్య పొసగని పరస్థితి ఏర్పడింది. తన ఆదేశాలు పాటించడం లేదని.. ఎస్ఈసీ కోర్టుకు వెళ్తే.. అధికారులకే మొదట ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి.
ఎన్నికల కోడ్ ను ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా తొలగించాలని రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. అయితే.. కోడ్ను తొలగించాలంటే.. ఎన్నికలను రద్దు చేయాలి. అలా చేస్తేనే.. కోడ్ రద్దవుతుంది. ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినందున.. ఎప్పుడు జరిగినా.. అప్పటి వరకూ కోడ్ అమల్లో ఉంటుంది. అందుకే.. ఎన్నికల ప్రక్రియ రద్దు చేయాలనే డిమాండ్ … ఒక్క పాలక పక్షం వైపు నుంచి కాకుండా.. అన్ని పార్టీల నుంచి వస్తోంది. ఎన్నికల్లో ఏకగ్రీవాల కోసం దాడులు కూడా జరిగాయని.. వాటిని పరిగణనలోకి ప్రక్రియ రద్దు చేయాలనే డిమాండ్ కూడా ఉంది. ఎన్నికల ప్రక్రియ రద్దు అయితే.. కోడ్ పోతుంది. కోడ్ ఉంటే.. ప్రభుత్వం పని చేయలేదు… ప్రజలకు కష్టాలు తీరవు. కరోనా వల్ల ఏపీకి పెద్ద కష్టమే వచ్చింది.