గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఎన్నికల షెడ్యూల్ ను ఆయన రాత్రికి రాత్రి ప్రకటించడమే కాకుండా..కోడ్ గురించి కూడా లేఖలు రాస్తూండటంతో ప్రభుత్వ యంత్రాంగానికి ఎలా స్పందించాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం పంచాయతీలకు మాత్రమే షెడ్యూల్ ప్రకటించినందున ప్రవర్తనా నియామవళి గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుందని.. పట్టణ, నగర ప్రాంతాలలో ప్రవర్తనా నియామళి అమలులో ఉండదని ఆయన స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతంలో సభలు నిర్వహించి…
గ్రామాల ప్రజలకు లబ్ధి చేకూర్చే పనులు చేపట్టవద్దని అలా చేస్తే.. కోడ్ ఉల్లంఘించినట్లవుతుందని నిమ్మగడ్డ చెబుతున్నారు.
అసలు ఎన్నికల విషయం ఏం చేయాలన్నదానిపై ప్రభుత్వంలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
సుప్రీంకోర్టుకు వెళ్లడం ఖాయమని ముందుగానే సమాచారం ఇచ్చారు. అయితే.. ఎన్నికలు ఆగుతాయన్న నమ్మకం ప్రభుత్వ వర్గాల్లో కూడా లేదు. తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే.. సంక్షేమ పథకాలను అన్నింటినీ నిలిపివేసి… టీడీపీ వల్లే అని ప్రచారం చేస్తే ఎలా ఉంటుందా అన్న చర్చ కూడా.. జరుగుతున్నట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. గ్రేటర్ ఎన్నికల సమయంలో.. టీఆర్ఎస్ అలాంటి వ్యూహమే పాటించిందని .. అది వర్కవుట్ అవుతుందా అన్న దిశగా ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే.. ఇళ్ల స్థలాల పంపిణీ మధ్యలో ఉంది. అలాగే.. పదకొండో తేదీన అమ్మఒడిని పంపిణీ చేయాల్సి ఉంది. ఏపీకి ఆర్థిక ఇబ్బందులు ఎలాగూ ఉన్నాయి.
ఈ కోడ్ కారణంగా ఆ పథకం అమలు నిలిపివేస్తే.. నెల లేదా రెండు నెలలు వెసులుబాటు లభిస్తుందని వారు భావిస్తున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఈనెల 11న ఇవ్వాల్సిన అమ్మఒడి పథకాన్ని దుష్ట శక్తులు ఎన్నికల కోడ్ పేరుతో ఆపేసే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికల విషయంలో ప్రభుత్వం ఏం చేయాలన్నదానిపై విభిన్న వ్యూహంతో ముందుకెళ్తోందని.. తాజా పరిణామాలతో తెలుస్తోంది.