అనుకున్నట్టే అయ్యింది. చెన్నైలోని ప్రతిష్టాత్మకమైన ఆర్కే నగర్ ఉప ఎన్నిక రద్దయ్యింది. ఓటర్లకు లంచం ఇచ్చేందుకు అన్నా డీఎంకే పార్టీ ప్రయత్నిస్తోందనడానికి బలీయమైన ఆధారాలు లభించడంతో ఎన్నికల కమిషన్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి చెన్నైలో సాగిన ఆదాయపన్ను దాడులలో ఏడుగురు మంత్రులకు 89 కోట్ల రూపాయలను పంపిణీ చేసే బాధ్యతను అప్పగించినట్లు తేలింది. దివంగత ముఖ్యమంత్రి జె జయలలిత మరణానంతరం ఆర్కే నగర్లో ఉప ఎన్నికను చేపట్టారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వికె శశికళ జైలు పాలుకావడంతో అక్కడ పోటీకి ఆమె తన బంధువు టిటివి దినకరన్‌ను ఎంపిక చేసింది. ఓ పన్నీర్ సెల్వం పక్కలో బల్లెంలా ఇ మధుసూదనన్‌ను బరిలో దింపారు.
అంతకుమించి జయలలిత అన్న కుమార్తె దీపా జయకుమార్ ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తుండడంతో అధికార పార్టీకి ఈ ఉప ఎన్నిక ప్రతిష్టగా తీసుకుంది. ఎలాగైనా నెగ్గాలనే తపనతో ఏడుగురు మంత్రులకు ఆ బాధ్యతలు అప్పగించింది. పక్కా ప్రణాళిక రచించింది. 256 సెగ్మెంట్లుగా విభజించిన నియోజకవర్గంలో 2 లక్షల 60వేలమంది ఓటర్లను లక్ష్యంగా చేసుకుంది. ఒక్కొక్కరికీ 4000 రూపాయల చొప్పున అందించేందుకు పావులు కదిపింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయ రాజా సోదరుడు గంగై అమరన్‌ను పోటీకి పెట్టింది. తన అభ్యర్థి గెలవాలని ఆ పార్టీ కూడా ప్రయత్నిస్తుంది కదా. ఎన్నిక నిర్వహణకు ఆరు రోజుల ముందు ఆదాయ పన్ను శాఖకు అందిన ఉప్పుతో అన్నాడీఎంకే ప్రణాళిక భగ్నమైంది. అక్కడ ఎన్నిక సంగతి పక్కన పెడితే పార్టీ పరువు గంగలో కలిసిపోయింది.
ముఖ్యమంత్రి పళనిసామి సహా అటవీ శాఖ మంత్రి దిండిగల్ శ్రీనివాసన్, ఆర్థికమంత్రి జయకుమార్‌లకు గెలుపు లక్ష్యాన్ని నిర్దేశించారని ఐటీ దాడులలో బహిర్గతమైన ఓ డాక్యుమెంట్ వెల్లడించింది. 33వేల మంది ఓటర్లకు 13.27 కోట్ల రూపాయలు పంచే బాధ్యతను ముఖ్యమంత్రికి నిర్దేశించారనేది ఆ డాక్యుమెంట్లో కీలకమైన అంశం. సహజంగానే ఈ ఆరోపణను శశికళ వర్గం తోసి పుచ్చింది. నైతిక విలువలంటూ చిలవపలవలుగా చిలకపలుకులు పలికిన అన్నా డీఎంకే నేతలు ఇది దిక్కుతోచని పరిస్థితిని కల్పించింది. దీన్నే వారు తీవ్రంగా పరిగణిస్తే సీఎం ఇప్పటికే రాజీనామా సమర్పించాలి. సాక్షాత్తు ఐటీ నివేదిక కావడంతో ఇప్పుడు పళని సామికి ఏదో ఒకటి చేయాల్సిన తరుణం ఆసన్నమైంది. ఎన్నిక నిర్వహించి, దినకరన్ గెలుపొందుంటే పళని సామి పదవికి నూకలు చెల్లిపోయుండేవి. ఇప్పటికైనా ఆలస్యమేమీ లేదాయనకు రాజీనామా చేయడానికి. పరువును దక్కించుకోడానికి అదొక్కటే మార్గం. తమిళనాట ఓటర్లను ప్రలోభపెట్టారనే ఆరోపణలతో ఎన్నిక రద్దవడం ఇది కొత్తేమీ కాదు. కిందటేడాది తంజావూరు, అరవకురుచ్చి ఎన్నికలు ఇలాగే రద్దయ్యాయి. ఇక్కడ అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు డబ్బు పంచడానికి ప్రయత్నించడం ఇందుకు కారణమైంది.
గెలవాలనే తపనే తప్ప, ఎంత సునాయాసంగా గెలవాలో, ఓటర్లకు ఎంత చులాగ్గా డబ్బు పంచిపెట్టేయాలో వారికి తెలీదు. మా పంతం తెలిసి, ఎవరూ తమ జోలికి రారులే అనే ధీమాతో తమిళులుంటారు. అన్ని వ్యవహారాలూ జల్లికట్టు ఉద్యమం మాదిరిగా సాగిపోతాయని అనుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఓటర్లకు డబ్బును పంచడానికి రకరకాల, సురక్షితమైన మార్గాలను కనిపెట్టేశారు. అపార్ట్మెంట్లకు డెవలప్మెంట్ ఫండనీ, బస్తీలకు ఇంకొకటనీ ఇలా అనేక దారులు. తెలుసుకోరు.
subrahmanyam vs kuchimanchi