బ్యాలెట్లో ఓట్లు ఎటు పోతున్నాయో తెలియదంటున్న పార్టీలు.. కచ్చితంగా.. వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాలని పట్టుబడుతున్నాయి. కానీ ఆలస్యం జరుగుతుందని.. కుదరదని ఈసీ చెప్పుకుంటూ వస్తోంది. అన్ని రాజకీయ పార్టీలు న్యాయపోరాటం ప్రారంభించారు. ఈ క్రమంలో… లెక్కించడం తప్పేమీ కాదన్న నివేదిక… ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ని ఈసీ అడిగింది. ఈ సంస్థ.. సానుకూలంగా స్పందించింది. అసెంబ్లీ నియోజకవర్గంలోని ఒక పోలింగ్ కేంద్రంలో మాత్రమే వీవీ ప్యాట్లను లెక్కించాలని గతంలో ఈసీ ఆదేశాలు ఇచ్చింది. కనీసం 50 శాతం వీవీ ప్యాట్లను లెక్కించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని 22 పార్టీలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి.
వీవీ ప్యాట్ల కేసు సుప్రీం కోర్టులో విచారణకు వచ్చినప్పుడు.. ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈసీకి కూడా నోటీసులు పంపింది. సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇవ్వాలని ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ ….ఐఎస్ఐ..ని కోరింది. ఈ నెల 25న సుప్రీం కోర్టులో కేసు విచారణకు రానుంది. భారీ స్థాయిలో వీవీ ప్యాట్ల లెక్కింపు సాధ్యమేనని ఐఎస్ఐ తేల్చింది. దీనికి సంబంధించిన ఒక నివేదిక ఇప్పటికే ఎన్నికల సంఘానికి చేరింది. యాభై శాతం వీవీ ప్యాట్లను లెక్కించాలని డిమాండ్ సహేతుకమైనదేనని అంటూ.. అన్ని కుదరకపోయినా వీలైనన్ని ఎక్కువ వీవీ ప్యాట్లను లెక్కించే చర్యలు చేపట్టడంలో తప్పు లేదని నివేదికలో అభిప్రాయపడ్డారు.
నివేదికను ఈ నెల 25న సుప్రీం కోర్టుకు సమర్పించనున్నారు. 17వ లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపుజరిగే మే 23 లోపే సుప్రీం కోర్టు తీర్పు వచ్చే అవకాశం ఉంది. యాభై శాతం వీవీ ప్యాట్లను లెక్కించేందుకు మూడు నుంచి నాలుగు గంటల కంటే ఎక్కువ సమయం పట్టదని 22 పార్టీలు సుప్రీం కోర్టుకు విన్నవించుకున్నాయి. ప్రజాస్వామ్యంలో ఏదైనా నమ్మకం ముఖ్యం కాబట్టి.. అనుమానాలు నివృతి చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందిస్తుందని రాజకీయ పార్టీలు నమ్ముతున్నాయి.