అసెంబ్లీ రద్దు చేస్తున్న సందర్భంలో, ముందస్తు ఎన్నికలకు సంబంధించి కేసీఆర్ ఓ మాట చెప్పారు.. చాలామందికి గుర్తుండే ఉంటుంది. తాను ఎన్నికల అధికారులతో కలిశాననీ, అక్టోబర్ లో షెడ్యూల్ వస్తుందనీ, నవంబర్ లో నోటిఫికేషన్ ఉంటుందీ, డిసెంబర్ లో ఎన్నికలు పూర్తి చేసుకుని కొత్త ప్రభుత్వం కొలువు తీరుతుందన్నారు. తెలంగాణ విషయంలో అచ్చంగా అలానే ఎన్నికల షెడ్యూల్ ప్రకటన జరగడం విశేషం! దీంతో స్పష్టమౌతున్నది ఏంటంటే… అసెంబ్లీ రద్దు చేయడానికి ముందు, కేసీఆర్ ఢిల్లీ వెళ్లి అక్కడి అధికారులతో అన్నీ ముందుగా మాట్లాడుకునే వచ్చారనేది..! అయితే, ఎన్నికలకు సంబంధించి కేసీఆర్ అలా మాట్లాడటం సరికాదని రావత్ అప్పట్లో వ్యాఖ్యానించారు. కానీ, ఆరోజున కేసీఆర్ ఏది చెప్పారో.. ఎన్నికల షెడ్యూల్ అచ్చం అలానే ఉంది కదా!
ఇంకోటి, ఓటర్ల జాబితా అవకతవకలకు సంబంధించిన పిటిషన్ కోర్టులో ఉంది. సోమవారం దానిపై కోర్టు స్పందిస్తుంది. అయితే, అది ఎన్నికల నిర్వహణపై వ్యక్తమైన అభ్యంతరం కాదు కాబట్టి, షెడ్యూల్ ప్రకటించేసుకోవచ్చు అనే తొందరలో ఎన్నికల సంఘం తేదీలను శనివారమే విడుదల చేసింది. మరో రెండ్రోజులు, అంటే సోమవారం నాడు ఓటర్ల జాబితాలకు సంబంధించి హైకోర్టు ఏం చెబుతుందో విన్నాక షెడ్యూల్ ప్రకటిస్తే కొంత బాగుండేది. అయితే, హైకోర్టులో ఉన్నది కేవలం జాబితాలకు సంబంధించి కేసు మాత్రమే కదా అనే లాజిక్ ను రావత్ వినిపించారు కూడా! సాంకేతికంగా చూసుకుంటే అది సరైందే అనిపిస్తుంది. కానీ, ప్రాక్టికల్ గా చూసుకుంటే… ఓటర్ల జాబితా లేకుండా ఎన్నికలు జరగవు కదా! ఆ జాబితాను పాదర్శకంగా తయారు చేయాల్సిన అవసరం ఉంటుంది కదా!
కాబట్టి, ఓటర్ల జాబితాను పరిపూర్ణంగా రూపొందించకుండానే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం అనేది కొంత అసంబద్ధమైన చర్యగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను సోమవారం తరువాత ప్రకటించినా కొంత బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. దీంతో సోమవారం నాడు హైకోర్టు స్పందన కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. ఏదేమైనా, తెలంగాణలో ముందస్తు ఎన్నికలు కేసీఆర్ అనుకుంటున్నట్టుగానే… ఆయన ప్రయత్నించినట్టుగానే జరిపేందుకు అన్ని వైపుల నుంచి సానుకూలతలు ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు!