రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. 15 రాష్ట్రాల్లో ఎప్రిల్ నెలాఖరుకు ఖాళీ అయ్యే 56 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 3 స్థానాలు, తెలంగాణలో 3 స్థానాలు ఖాళీ అవబోతున్నాయి. ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఫిబ్రవరి 15 నామినేషన్ల దాఖలుకు చివరి రోజు .. ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహిస్తారు. ఉదయం 9గం.ల నుంచి సాయంత్రం 4గం.ల వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 5గం.ల నుంచి జరగనున్న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
ప్రస్తుతం ఉన్న బలాల ప్రకారం ఏపీలో మూడు సీట్లు వైసీపీ ఖాతాలో పడతాయి. కానీ టిక్కెట్ల కేటాయింపుల తర్వాత వైసీపీలో గందరగోళం ఏర్పడింది. దీంతో టీడీపీ అభ్యర్థిని నిలబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో టీడీపీ బలాన్ని తగ్గించడానికి గంటా శ్రీనివాస్ రాజీనామా ఆమోదించారు. నలుగురు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలపై వేటు వేసేందుకు ఏర్పాట్లు చేశారు. స్పీకర్ విచారణకు పిలిచారు. అయితే ఇంకా నిర్ణయం తీసుకోక ముందే.. ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. ఇప్పుడు అనర్హతా వేటు వేస్తే చెల్లదు. టీడీపీ అభ్యర్థిని నిలబెడితే మాత్రం పోలింగ్ జరగడం ఖాయం.
తెలంగాణలో ప్రస్తుతం ఉన్న బలాల ప్రకారం ఒకటి బీఆర్ఎస్ పార్టీకి లభించవచ్చు. కానీ అక్కడా ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వక భేటీలు నిర్వహిస్తున్నారు. మూడు స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల్ని పెడితే.. అక్కడా పోలింగ్ జరుగుతుంది. సాధారణ ఎన్నికలకంటే ముందు తెలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి.