ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్టుగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ చెప్పారు. ఎవ్వరికీ ఎలాంటి అనుమానాలకూ తావివ్వకుండా ఓట్ల లెక్కింపు ప్రక్రియను అత్యంత పాదర్శకంగా నిర్వహిస్తామని అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ… 175 అసెంబ్లీ, 25 లోక్ సభ నియోజక వర్గాల ఓట్ల లెక్కింపు కోసం దాదాపు 21 వేల మంది సిబ్బంది అవసరమౌతారన్నారు. పార్లమెంటు, అసెంబ్లీ నియోజక వర్గాలకు పదిహేను టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఒక్కో టేబుల్ దగ్గరా సూపర్ వైజర్, కౌటింగ్ అసిస్టెంట్, మైక్రో సూపర్ వైజరు కూడా ఉంటారని, ఓట్ల లెక్కింపు సరళిని వారు నిశితంగా పరిశీలిస్తుంటారని ద్వివేదీ చెప్పారు. కౌంటింగ్ టేబుళ్ల సంఖ్య పెంచాలంటూ కొన్ని జిల్లాల నుంచి కోరుతున్నానీ, వాటిని కూడా పరిగణనలోకి తీసుకుని ఓట్ల లెక్కింపును వీలైనంత సాఫీగా జరిగేలా చూస్తామన్నారు.
ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పాల్గొనే సిబ్బందికి పక్కగా శిక్షణ ఇవ్వాలని ఈసీ నిర్ణయించింది. ఎన్నికల సందర్భంగా పోలింగ్ తీరుపైనా, అధికారుల పనితీరుపైనా చాలా విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో సరైన శిక్షణ లేని అధికారుల వల్లనే ఓటింగ్ ప్రక్రియ ఆలస్యమైందంటూ ఆరోపణలు వచ్చాయి. ఈసారి అలాంటివేవీ రాకూడదని ఈసీ వ్యూహాత్మకంగా ఉంది. ఓట్ల కౌంటింగ్ కి అవసరమైన 21 వేల సిబ్బంది విషయంలోనూ జాగ్రత్తలు పడుతోంది. లెక్కింపునకు వచ్చే సిబ్బందికి… తాము ఏ నియోజక వర్గం ఓట్లను లెక్కించబోతున్నామూ అనేది కూడా చివరి నిమిషం వరకూ చెప్పరని అంటున్నారు. అంతేకాదు, లెక్కింపు మొదలైన తరువాత కూడా కొన్ని గంటల వ్యవధిలో రెండుసార్లు మారుస్తారని ద్వివేదీ చెప్పారు. నియోజక వర్గానికి ఐదు చొప్పున వీవీప్యాట్ల స్లిప్పులను లెక్కిస్తారనే విషయం తెలిసిందే. ఆ ఈవీఎంలను లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తారని చెప్పారు.
పోలింగ్ సందర్భంగా ఏర్పాట్లు, ఎన్నికల నిర్వహణపై ఈసీ చాలా విమర్శలు ఎదుర్కొంది. ఇప్పుడు ఓట్ల లెక్కింపు సమయంలో అలాంటివాటికి ఆస్కారం లేకుండా చెయ్యాలనే ఉద్దేశంతోనే పక్కా ఏర్పాట్లు చేస్తున్నారు. నిజానికి, ఇప్పుడు ఈసీ తీసుకుంటున్న జాగ్రత్తలన్నీ ఎన్నికలకు ముందే తీసుకోవాల్సింది. ఎందుకంటే, ఎన్నికల్లో ఓటింగ్ ప్రక్రియే అత్యంత కీలకమైంది. ఓట్ల లెక్కింపు అనేది కేవలం కొన్ని ప్రాంతాలకు పరిమితమైన ప్రక్రియ కాబట్టి, ఏర్పాట్ల గురించి కాస్త జాగ్రత్తపడితే చాలు. కానీ, జరగాల్సిందంతా ఓటింగ్ సమయంలోనే జరిగిపోయింది. పడాల్సిన ఇబ్బందులు చాలామంది సామాన్య ప్రజలు పడ్డారు.