ఎన్నికల్ని పక్షపాత రహితంగా నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద ఉంటుంది. కానీ, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి ఇప్పుడు మరోసారి విమర్శలు ఎదుర్కొంటున్నారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలకు గురౌతున్నారు. ఈ నేపథ్యంలో నాగిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈసీ నిబంధనలు తెలియక కొంతమంది నాయకులు తప్పుడు విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వానికి లోబడిందనే వాదన ప్రజల్లోకి తీసుకెళ్లడం సరికాదన్నారు. తమ పరిధిలో వీలున్నంతవరకూ స్వతంత్రంగానే వ్యవహరిస్తున్నామన్నారు. శాసనసభ ద్వారా పాస్ అయిన చట్టం ప్రకారం ఎన్నికల ప్రణాళికపై ప్రభుత్వం అనుమతులు తప్పనిసరి అవుతుందని చెప్పారు. ఎవరి ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా చట్టాన్ని అనుసరించి తాము నడవాల్సి ఉంటుందనీ, అదే చేస్తున్నామన్నారు.
ఇలా పదేపదే తమ పనితీరు మీద ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఈసీకి ఎందుకొస్తోంది? గడచిన అసెంబ్లీ ఎన్నికలే తీసుకుంటే… పెద్ద సంఖ్యలో ఓట్లు గల్లంతయ్యాయంటూ ఓటర్లు గగ్గోలు పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటు ఉండి, లోక్ సభకు వచ్చేసరికి జాబితాలో పేరు లేనివారు చాలామంది ఉన్నారు. ఆ సమయంలో ఈసీ ఏం చేసింది… ప్రజలకు ఒక క్షమాపణ చెప్పేసి మ.మ. అనిపించేశారు. దేశంలో పౌరుడు ఓటు హక్కు కోల్పోవడాన్ని ఒక క్షమాపణతో సరిపెట్టడం సరైంది ఎలా అవుతుంది? అందుకే ఈసీ ఆ సమయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకి కారణం కూడా ఈసీ పనితీరే. ఓటర్ల జాబితాలో అవకతవకల్ని పరిశీలించడానికి రాజకీయ పార్టీలకు చాలినంత సమయం ఇస్తే తప్పేముంది? రిజర్వేషన్లు ప్రకటించాక ఒక్కరోజు గడువులోనే నామినేషన్ల దాఖలుకు సమయం ఇచ్చారు. రిజర్వేషన్లు తెలియగానే… వెంటనే అభ్యర్థుల్ని ఎంపిక చేసి, నామినేషన్ల దాఖలుకి రాజకీయ పార్టీలకు సమయం సరిపోకపోవచ్చు. కాస్త వెసులుబాటు కల్పిస్తే తప్పేముంది? అయితే, ఇదే అంశంపై తెరాస నేతలు ఏమంటున్నారంటే… మీ పార్టీలో అభ్యర్థుల కొరత ఉందా, అన్ని పార్టీలకూ ఉండేది అదే సమయం కదా అంటూ ప్రతిపక్షాలను తిప్పికొడుతున్నారు. అధికార పార్టీ ధీమాలోనే ప్రభుత్వానికి అనుకూలంగా ఈసీ విధానాలున్నాయనే అనుమానం ప్రతిపక్షాలకు కలిగే విధంగానే ఉంది. దేనికీ సమయం ఇవ్వకుండా హడావుడిగా ఎన్నికల్ షెడ్యూల్ రూపొందించారు కాబట్టే ఈసీ ఇలా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే ఈసీ మీద అన్ని పార్టీలకూ సరైన అభిప్రాయం కలుగుతుంది, అది అవసరం కూడా. కానీ, ఆ దిశగా ప్రస్తుతం ఈసీ ఆలోచిస్తోందా అనేది ప్రశ్న? వినిపిస్తున్న విమర్శలను ఖండించేసే విధంగా ఇలా ఒక ప్రకటన చేసేస్తే చాలని ఈసీ భావిస్తోందా?