ఫోని తుపాను బీభత్సం సృష్టించడంతో… ఎన్నికల సంఘం.. ఎట్టకేలకు మొద్దు నిద్ర వీడింది. ఏపీలోని నాలుగు జిల్లాల్లో ఎన్నికల కోడ్ సడలిస్తూ.. నిర్ణయం తీసుకుంది. తుపాను ముంచుకొస్తోందని… నాలుగు జిల్లాలపై ప్రభావం ఉందని.. తక్షణం ఎన్నికల కోడ్ సడలించాలని.. మూడు రోజుల క్రితమే… ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. మూడు రోజుల పాటు.. ఆ లేఖను తన దగ్గరే పెట్టుకున్న సీఈసీ.. తీరా.. తుపాన్ తీరం దాటిన తర్వాత … ఆ నాలుగు జిల్లాల్లో కోడ్ సడలిస్తూ నిర్ణయాన్ని ప్రకటించారు. తుపాను ముప్పు.. ఒడిషాతో పోలిస్తే ఏపీపై అంత తీవ్రంగా లేదు. కానీ.. భారీ వర్షాలు, గాలుల వల్ల.. ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. పశ్చిమగోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. భారీ వర్షాలు పడుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో గాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. కొన్ని చోట్ల కరెంట్ నిలిచిపోయింది.
తక్షణం.. సహాయ, పునరావాస చర్యలు చేపట్టాల్సి ఉండటంతో… నష్టం జరిగిపోయాక… కోడ్ను సడలిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఫోని తుపాను సహాయ చర్యలు చేపట్టాలంటే.. ముఖ్యమంత్రికి.. కోడ్ అడ్డం వస్తోంది. అధికారులకు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేని పరిస్థితి ఉంది. నిన్నంతా సచివాలయంలో ఉన్నప్పటికీ.. ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. కేవలం.. అధికారులు తీసుకుంటున్న సహాయ చర్యల గురించి తెలుసుకుని.. సలహాలు, సూచనలు మాత్రమే ఇచ్చారు. తీతలి తుపాను సమయంలో.. ఇచ్చిన జీవోలను.. ప్రస్తుత పరిస్థితికి అన్వయించుకుని.. చర్యలు చేపట్టాలని సూచించారు. ఇప్పుడు కోడ్ సడలించడంతో.. ఆ నాలుగు జిల్లాల్లో.. పూర్తి స్థాయి అధికారిక నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఒడిషాకు.. ఐదు రోజుల కిందటే… పదకొండు జిల్లాల్లో కోడ్ సడలించారు. ఏపీ సీఎం లేఖ రాసినా స్పందించలేదు. చివరికి.. ప్రజలకు జరిగే నష్టానికి.. ఈసీని నిందిస్తారనే భయపడి.. తుపాను తీరం దాటిన తర్వాత… సడలించినట్లు భావిస్తున్నారు.
ఎన్నికల కోడ్లో … సహజంగానే ప్రకృతి వైపరీత్యాల సమయంలో సడలింపు ఇవ్వాలని ఉంది. అయితే.. ఆ మేరకు.. ఈసీనే నిర్ణయం తీసుకోవాల్సి ఉండటంతో.. ఆలస్యం అయింది. రెండు రోజుల ముందే ఆ నాలుగు జిల్లాల్లో కోడ్ సడలిస్తే.. మరింత మెరుగైన జాగ్రత్తలు తీసుకునే వారమని అధికారవర్గాలు చెబుతున్నాయి.