కొద్ది రోజుల క్రితం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. రేవంత్ రెడ్డిని.. అర్థరాత్రి తలుపులు బద్దలు కొట్టి.. పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది చర్చనీయాంశమయింది. వ్యవహారం కోర్టుకు వెళ్లడం.. అలా అరెస్ట్ చేయడం నిబంధనల ఉల్లంఘనగా అభిప్రాయం ఏర్పడటంతో… ఈసీ…వికారాబాద్ జిల్లా ఎస్పీ అన్నపూర్ణను బదిలీ చేసింది. అప్పుడు ఆమె బదిలీని ఎవరూ తప్పపట్టలేదు. అక్కడ తప్పు జరిగిందని అందరూ నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు.. ఏపీలో ఎన్నికల వాతావరణం స్వింగ్లో ఉంది. ఇలాంటి సమయంలో.. ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు, కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నంలను… భారత ఎన్నికల సంఘం హుటాహుటిన బదిలీ చేసింది. వీళ్ల మీద ఏ ఆరోపణలు ఉన్నాయో.. ఎవరికీ తెలియదు. వీళ్లు వివాదాస్పదమైన పనులేమైనా చేశారో స్పష్టత లేదు. కేవలం.. వైసీపీ నేతలు మాత్రం.. ఎప్పట్లాగే.. కొంత మంది పోలీసుల్ని టార్గెట్ చేసుకుని చేస్తున్న ఆరోపణల్లో వీరి పేర్లను ప్రముఖంగా ప్రస్తావించారు. అంత మాత్రానికే బదిలీ వేటు వేస్తారా…
ఇంటలిజెన్స్ చీఫ్ది…ఎక్కడైనా తెర వెనుక పాత్రే. ఆయనకు.. లా అండ్ ఆర్డర్ నిర్వహణ.. ఎన్నికల్లో కల్పించుకునే అవకాశాలు ఉండవు. ఓ రకంగా చెప్పాలంటే.. ఎన్నికల విధులతో ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధాలు ఉండవు. ప్రముఖుల భద్రత వ్యవహారాల్లో కీలకంగా ఉంటారు. ఇలాంటి అధికారిని ఉన్న పళంగా బ దిలీ చేసేసిన ఈసీ… ఆయనను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఆదేశాల్లో పేర్కొంది. అసలు నేరుగా ఎన్నికల విధులతో సంబంధం లేని అధికారిని… బదిలీ చేసి.. మళ్లీ ఆయనను… ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని ఆదేశించడం ఎందుకో.. చాలా మందికి అర్థం కాలేదు. పోలీసులు కూడా.. ఇలాంటి ఆదేశాలు అందుకోవడం ఇదే మొదటి సారి అంటున్నారు. ఇక శ్రీకాకుళం, కడప జిల్లా ఎస్పీలపై.. ఎన్నికల నిర్వహణ పరంగా ఎలాంటి ఆరోపణలు లేవు. అయినా… వైసీపీ కోరిక మేరకు.. వారిని కూడా బదిలీ చేశారు.
కడప ఎస్పీ బదిలీ వ్యవహారం.. ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే… వైఎస్ వివేకా హత్య కేసులో… ఇప్పటికే.. పూర్తి స్థాయి ఆధారాలు సేకరించిన ప్రత్యేక దర్యాప్తు బృందం… అరెస్టులకు సిద్ధమవుతోంది. ఈ అరెస్టులు చేయాల్సింది.. కడప పోలీసులే. ఆ కేసులో నిందితులు ఎవరో… ఇప్పుడు సామాన్య జనానికి కూడా అర్థమైపోయింది. ఈ సమయంలో.. పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి అరెస్టుల్ని నిలువరించడానికే.. ఈ బదిలీలు జరిగాయనే అభిప్రాయం అంతటా ఏర్పడుతోంది. విధుల్లో వివాదాస్పదంగా వ్యవహరిస్తే… ఎవరికైనా అనుకూలంగా వ్యవహరిస్తే.. బదిలీ చేయడంలో అర్థం ఉంది. కానీ ఏపీలో జరిగిన ఎన్నికల బదిలీల్లో… ఎలాంటి ప్రాతిపతిక లేకుండా పోయింది. కేంద్రంలో పలుకుబడి ఉంది కాబట్టి… వైసీపీ.. తమకు కావాల్సిన రీతిలో బదిలీల్ని చేసుకుంది. ఇంకా అధికారం ఉంటే.. తెలంగాణ అధికారుల్ని తెచ్చి పెట్టమని డిమాండ్ చేస్తారేమో…?