తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆరో తేదీన అసెంబ్లీని రద్దు చేశారు. అదే రోజున సాయంత్రం గెజిట్ వచ్చింది. ఈ రోజు పదకొండో తేదీ అంటే.. ఐదు రోజులు మాత్రమే మధ్యలో గడిచాయి. ఈ లోపు తెలంగాణ ఎన్నికలపై కేంద్రం ఎన్ని నిర్ణయాలు తీసుకుందో లెక్కే లేదు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ షెడ్యూల్ను సవరించడం దగ్గర్నుంచి… ఎన్నికల కమిషన్ బృందాన్ని తెలంగాణకు.. ఏర్పాట్లపై ప్రత్యక్షంగా సమీక్ష జరపడానికి పంపేవరకూ.. చాలా నిర్ణయాలు అఘమేఘాలపై తీసుకున్నారు. తాము ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని.. తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ ఢిల్లీ వెళ్లి నివేదిక ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణకు వచ్చే కమిటీ కూడా.. అదే నివేదికను మరో రూపంలో రెడీ చేసి.. ఈసీకి ఇచ్చే అవకాశం ఉంది. కాకపోతే.. అధికారికంగా.. నిర్వహించాల్సిన సమావేశాలు నిర్వహించక తప్పదు.
హైదరాబాద్ లో రెండు రోజుల పాటు కేంద్ర ఎన్నికల బృందం బిజీ బిజీగా గడుపనుంది. 9 రాజకీయ పార్టీలు, పోలీస్ అధికారులు, కలెక్టర్లతో సమావేశం కానున్నారు. సమావేశం లో ఎన్నికల నిర్వహణ , పోలింగ్ బూత్ లపై ఏర్పాటు పై క్లారిటీ తీసుకుంటారు. ఉమేష్ సిన్హా బృందం లో 9 మంది వివిధ అంశాలను అడిగి తెలుసుకోనున్నారు.. రేపు సాయంత్రం నుంచి మరుసటి రోజు రాత్రి వరకు అందరి అభిప్రాయాలను సేకరించి నివేదిక సిద్ధం చేయనున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం ఇప్పటికే బడ్జెట్ లో 308 కోట్ల రూపాయలను కేటాయించారు. వారం లో అన్ని నియోజకవర్గాలకు ఈ వి ఎం లు పంపిణీ చేయనున్నారు..
సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్కు ఉమేష్ సిన్హా బృందం వస్తుంది. సాయంత్రం 6.30 గంటల నుంచి 8.30 వరకు 9 పొలిటికల్ పార్టీలతో సమావేశం అవుతారు. బుధవారం కూడా.. అధికారులతో సమీక్ష జరుపుతారు. మరో వైపు 2018 ఓటర్ల జాబితా ముసాయిదాను ఎన్నికల సంఘం విడుదల చేసింది 2018 మార్చిలో ప్రకటించిన ఓటర్ల జాబితాకు సవరణ చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈనెల 25వ తేదీ వరకు అభ్యంతరాలు, వినతులకు అవకాశం. వచ్చే నెల 8వ తేదీన ఓటర్ల తుది జాబితా విడుదల.