ఒకటి, రెండు చోట్ల దాడులు జరిగినా… విస్తృతంగా ప్రచారం అవుతోంది. అభ్యర్థులకు సరైన ఫారాలు అందకపోయినా… వైసీపీ కుట్ర అనే ఆరోపణలు బలంగానే వస్తున్నాయి. ఇలాంటి సమయంలో.. రాష్ట్ర ఎన్నికల సంఘం తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది. అధికార పార్టీ పూర్తిగా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని చేతుల్లోకి తీసుకుందనే ఆరోపణలు చేస్తోంది. దానికి సాక్ష్యంగా రోజూ వీడియోలు ప్రదర్శిస్తోంది. అవి మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ హైలెట్ అవుతున్నాయి. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీరుపై ప్రజల్లో అనుమానాలు ప్రారంభమయ్యే పరిస్థితి ఏర్పడింది.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేసిన తరవాత కొన్ని చోట్ల ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఈసీ షెడ్యూల్ ప్రకటించాక ఎన్నికలు వాయిదా వేసే అధికారం కలెక్టర్లకు ఉండదు. ఈసీనే నిర్ణయం తీసుకోవాలి. ఎన్నికల వాయిదా మాత్రమే కాదు.. ఎన్నికల ప్రకటన విడుదల చేసిన రోజే.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిఘా యాప్ ను ఆవిష్కరించారు. ఎన్నికల అక్రమాలు జరిగితే.. అందులో పంపించాలని…కోరారు. నిజానికి ఆ పని చేయాల్సింది రాష్ట్ర ఎన్నికల సంఘం.
నామినేషన్ల పర్వం నుంచి ఎన్నికలు ముగిసేవరకు.. అనేక రకాల సమస్యలు ఎదురొస్తాయి. అన్ని రకాల ఎన్నికలు పారలల్గా జరుగుతూండటంతో…ఎన్నికల సంఘానికి కూడా పరిస్థితి క్లిష్టంగా ఉంది. ఈసీ పనితీరుపై వస్తున్న అనేక విమర్శలపై ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతోంది. అదే సమయంలో.. పలు చోట్ల… నామినేషన్లు వేయకుండా దాడులు జరుగుతున్నా… పట్టని పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగానే రాష్ట్ర ఎన్నికల సంఘం పనితీరు వివాదాస్పదమవుతోంది. అత్యంత కఠినంగా వ్యవహరించి.. ఎన్నికల నిర్వహణను చేపట్టకపోతే.. ప్రజలు నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.