సీఈవో మార్పు నుంచి ఈవీఎంల గోల్మాల్ వరకూ.. ఏపీపై ఓ “మోడస్ ఆపరెండి” తరహా ఆపరేషన్ జరిగింది. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమంగా పాలకులను నిర్ణయించాలి. రాజ్యాంగం అదే చెబుతోంది. ప్రజలు ఫ్రీ అండ్ ఫెయిర్‌గా ఓట్లేసినప్పుడే అది సాధ్యమవుతుంది. కానీ.. దేశంలో ఇప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితులు చాలా తేడాగా ఉన్నాయి. ఓ రాష్ట్రంలో తమకు ఇష్టం లేని ప్రభుత్వం రాకూడదన్న ఉద్దేశంతో… ఓ ప్రణాళికాబద్ధమైన కుట్రలు చేశారు. ఆ మోడస్ ఆపరెండి.. మామూలుగా లేదు. ఎన్నికల హడావుడి ప్రారంభమైనప్పటి నుంచి పోలింగ్ ముగిసేవరకూ.. ఏపీలో జరిగిన పరిణామాలు చూస్తే… ప్రజాతీర్పు కాలరాయడానికి ఎన్నెన్ని కుట్రలు అమలు చేశారో సులువుగానే అర్థమైపోతుంది.
మూడు నెలల ముందుగా సీఈవో మార్పుతో ప్లాన్ అమలు ..!
దేశంలో అప్పుడే ఎన్నికల హడావుడి ప్రారంభమయింది. అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల ప్రధాన అధికారులు ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. ఓటర్ల జాబితాలను సవరిస్తున్నారు. తుది జాబితాపై కసరత్తు చేస్తున్నారు… అలాంటి సమయంలో…. ఆంధ్రప్రదేశ్ సీఈవోగా ఉన్న ఆర్పీ సిసోడియాను.. కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఆయన స్థానంలో గోపాలకృష్ణ ద్వివేదీని బదిలీ చేసింది. సిసోడియా బదిలీ ఎందుకు..? ఆయనేమైనా తప్పు చేశారా..? అంటే.. ఏమీ లేదు. ఆయన ఆ పోస్టులోకి వచ్చి… ఏడాదిన్నర కూడా కాలేదు. కానీ.. ఓ ప్రణాళిక ప్రకారం బదిలీ జరిగింది. వైసీపీ నేతలు దొంగ ఓట్లు, ఓట్ల గల్లంతు అంటూ.. ఆరోపణలు చేస్తూ.. ఈసీకి ఫిర్యాదులు చేస్తూ ఉన్న సమయంలోనే ఈ బదిలీ జరిగింది. అసలు పూర్తి స్థాయి ఓటర్ల జాబితా సిద్ధం కాక ముందే వైసీపీ ఆరోపణలు చేయడం ఏమిటో… ఆయనను తొలగించడం ఏమిటో… సీఈసీకే తెలియాలి. నియమించిన గోపాలకృష్ణ ద్వివేదీ ఎవరు..? ఏపీ క్యాడర్ అయినప్పటికీ… డిప్యూటేషన్ పై కేంద్ర హోంశాఖలో పని చేసి.. జకీర్ నాయక్ అనే ఉగ్రవాదికి చెందిన సంస్థలకు అక్రమంగా అనుమతులు ఇచ్చిన ఆరోపణలపై సస్పెండ్ అయిన అధికారి. చివరికి రాజ్‌నాథ్ సింగ్‌ను మచ్చిక చేసుకుని సస్పెన్షన్ ఎత్తి వేయించుకుని… సొంత క్యాడర్ రాష్ట్రానికి వచ్చారు. ఈయన వ్యక్తిగతంగా.. చంద్రబాబును వ్యతిరేకిస్తారని… అధికారవర్గాల్లో ప్రచారం ఉంది. అదే సమయంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్ని అత్యంత దారుణంగా నిర్వహించి.. పాతిక లక్షల ఓట్లను గల్లంతు చేసేసి… సారీ చెప్పిన… తెలంగాణ సీఈవో రజత్ కుమార్…పై మాత్రం.. ఈగ కూడా వాలలేదు. సారీ చెప్పినా.. కేంద్ర ఎన్నికల సంఘం సంజాయిషీ కూడా అడగలేదు. ఇష్టం వచ్చినట్లు రిగ్గింగ్ చేసుకున్నందునే… పోల్ పర్సంటేజీ రెండు రోజుల వరకూ చెప్పలేకపోయారని వచ్చిన ఆరోపణలపైనా… సీఈవో నోరు విప్పలేదు. ఆయన మాత్రం.. హాయిగానే ఉన్నారు.
సీఈవోను మార్చిన వెంటనే ఓట్ల తొలగింపు ప్లాన్..!
జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ముగిసిన వెంటనే.. ఓ నినాదం అందుకున్నారు. దాని ప్రకారం… ఏపీలో 50 లక్షల ఓట్లను తొలగించాలి. పెన్‌డ్రైవుల్లో తొలగించాల్సిన ఓటర్ల జాబితాలను తీసుకెళ్లి ఇచ్చారు. అప్పుడే కొత్తగా వచ్చిన సీఈవోను.. వైసీపీ నేతలు రోజూ.. ఏదో ఓ ఫిర్యాదుతో కలవడం ప్రారంభించారు. వైసీపీ నేతలు ఇలా .. హడావుడి చేస్తూండగానే… లక్షల సంఖ్యలో ఫామ్-7లు రావడం ప్రారంభించాయి. మూడు రోజుల్లో దాదాపుగా పది లక్షలు వచ్చాయి. టీడీపీ నేతలు దీన్ని కనిపెట్టి.. రచ్చ చేయడంతో ఆగిపోయాయి.. లేకపోతే.. వారి టార్గెట్ యాభై లక్షలు ఫామ్-7 దరఖాస్తులు వచ్చి ఉండేవి. అన్నీ.. ఓ ప్లాన్ ప్రకారమే వచ్చాయి కాబట్టి… వాటిని తొలగించడం కూడా… అంతే పక్కాగా జరిగిపోయి ఉండేది. కానీ.. టీడీపీ ఆందోళన చేయడంతో.. సీఈవో… వెనక్కి తగ్గక తప్పలేదు. కేసులు పెట్టడంతో.. ఇక అన్నింటినీ పరిశీలించాల్సి వచ్చింది. లేకపోతే… తెలంగాణలోలా.. ఓట్లను తొలగించి సారీ చెప్పి ఉండేవారు. జరగాల్సినది జరిగిపోయేది. ఈ ఫామ్-7 కుట్ర ఏమిటో.. బయట పెట్టడానికి ఈసీ ఇప్పటికీ సహకరించడం లేదు. అంటే… పక్కాగా.. టీడీపీ ఓటర్లను గుర్తించి.. వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించడానికి..ఓ భారీ కుట్ర… ఎన్నికల సంఘం కనుసన్నల్లోనే జరిగిందని… ఏ మాత్రం తెలివి తేటలు ఉన్న వారికైనా.. అర్థమైపోతుంది.
అధికార యంత్రాంగాన్ని వైసీపీకి అనూకూలం చేసేలా బదిలీల ప్లాన్..!
దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలున్నాయి. తమిళనాడు డీజీపీపై… గుట్కా మాఫియా సహా అనేక ఆరోపణలు ఉన్నాయి. జార్ఖండ్ ఇంటలిజెన్స్ అత్యున్నత అధికారి నేరుగా.. ఎమ్మెల్యేలను అధికార పార్టీ కోసం కొనుగోలు చేస్తూ దొరికిపోయారు. ఇలాంటి అధికారులు దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు. వారంతా ఎన్నికల విధుల్లో ఉన్నారు. కానీ.. ఏపీలో మాత్రం… కారణం లేకుండా.. సీఎస్ దగ్గర్నుంచి సీఐల వరకూ.. అందర్నీ ఇష్టం వచ్చినట్లు బదిలీ చేసి పడేశారు. డీజీపీని పని చేయనివ్వకుండా చేశారు. వారిపై వచ్చిన ఆరోపణలు ఏమిటో.. ఈసీ చెప్పలేదు. ఇది అత్యంత బాధ్యతా రాహిత్యం… ఎన్నికల విధుల్లో ఉన్న అధికారుల మానసిక స్థైర్యం దెబ్బతీసి…ఈసీ అభీష్టానికి వ్యతిరేకంగా పని చేస్తే బదిలీ చేస్తారన్న భయం కల్పించడానికే ఈ బదిలీలు చేశారు. టీడీపీకి అనుకూలం అంటూ.. వారిపై ముద్ర వేసి.. బదిలీలు చేయడమే… అసలు కారణం. టీడీపీకి అనుకూలం అయితే.. ఈసీ ఆగ్రహిస్తుంది కాబట్టి.. వైసీపీకి అనుకూలంగా పని చేయాలనే సంకేతాలను..నేరుగా పంపారు. జగన్ అక్రమాస్తుల కేసులో సహ నిందితుడు అయిన వ్యక్తిని సీఎస్‌గా నియమించడం ద్వారా నేరుగా పంపిన సందేశం కూడా అదే.
వైసీపీకి ఫ్రీ హ్యాండ్.. టీడీపీపై ఐటీ గురి..!
పదుల సంఖ్యలో సీబీఐ కేసులు ఉన్న జగన్మోహన్ రెడ్డి… దాదాపుగా ప్రతి ఒక్కరిపై ఆర్థిక నేరాల కేసులు ఉన్న ఆయన పార్టీ అభ్యర్థులు నిశ్చింతంగా.. రాజకీయం చేసుకున్నారు. ప్రచారం చేసుకున్నారు. చివరికి పోలింగ్ ముందు రోజు .. ఓటుకు రూ. 3వేల రూపాయలు యథేచ్చగా పంచారు. కానీ.. తెలుగుదేశం పార్టీ నేతలపై మాత్రం ముప్పేట దాడి జరిగింది. ఎలాంటి ఆరోపణలు లేని.. వారిపై ఐటీ దాడులు జరిగాయి. వైసీపీ నేతలకు చెందిన సొమ్ము సిక్కోలు నుంచి… చిత్తూరు వరకు కోట్లకు కోట్లు పట్టుబడింది. కానీ.. ఏ ఒక్కదానిపై చర్యలు లేవు. ఐటీ సోదాలు లేవు. కానీ… టీడీపీ అభ్యర్థులపై దాడులు చేశారు. క్యాడర్ నూ వదిలి పెట్టలేదు. వైసీపీకి డబ్బులు పంచుకోవడంలో ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి.. టీడీపీపై నిర్బంధం అమలు చేశారని.. దీంతో స్పష్టమయింది. డబ్బును నియంత్రించాలనుకున్నప్పుడు రెండు పార్టీలపైనా అదే తరహా నిర్బంధం విధించాలి. కానీ.. వైసీపీకి మాత్రమే ఎందుకు అనుమతి ఇచ్చినట్లు..?
భద్రతా బలగాలు పరిమితం..! వైసీపీ చెప్పినట్లుగానే…!
పోలింగ్ ముందు నుంచి.. వైసీపీ వర్గాలు చాలా ప్లాన్డ్ గా ఉన్నాయి. ఈ సారి ఎలాంటి పరిస్థితుల్లో అయినా పులివెందుల ప్లాన్ ను అమలు చేసి.. ఏపీలో గెలవాలనేది ఆ ప్లాన్. ఆ విషయం చోటా రాజకీయ నేతకు కూడా తెలుసు. ఆ ప్లాన్ అమలు చేయాలంటే.. కేంద్రం సహకారం కావాలి. దానికి తగ్గట్లుగానే.. కావాల్సిన పనులు చేయించుకుంటూ వచ్చిన వైసీపీ… భద్రతా బలగాలు కూడా.. సరిపడినంతగా రాకుండా చేయగలిగిలింది. ఓ వైపు జగన్ లాంటి వ్యక్తి.. గెలుపు కోసం.. ఏమైనా చేయడానికి సిద్ధపడుతున్న సమయంలో.. ఓ పది కంపెనీల బలగాలు అదనంగా పంపాల్సిన ఈసీ.. సగానికి సగం తగ్గించేసింది. గత ఎన్నికల సమయంలో.. కేంద్ర బలగాలు… 320కిపైగా వస్తే.. ఈ సారి వాటి సంఖ్య 190లోపు మాత్రమే. చాలా పోలింగ్ బూత్‌లలలో హోంగార్డు మాత్రమే ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆ ఫలితమే.. హింసాత్మక ఘటనలు. వైసీపీ కోరుకున్నది.. కోరుకున్నట్లుగా జరిగిపోయింది. దీనికి ఈసీ సంపూర్ణంగా సహకరించింది. అంతా అయిపోయిన తర్వాత భద్రత కల్పించలేకపోయామని.. ద్వివేదీ పరశవంతో కూడిన పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.
ఎక్కడా లేని ఈవీఎం సమస్యలు ఏపీలోనే ఎందుకు..? కుట్ర కాదా..?
ఇక ఎన్నికల రోజు… ఈవీఎం మెషిన్ల విన్యాశాలు దేశం మొత్తం చూసింది. ఎక్కడా రాని సాంకేతిక లోపాలు .. ఏపీలో మాత్రమే వచ్చాయి. మొత్తం మెషిన్లలో దాదాపు పది శాతం మెషిన్లపై.. ఇంజినీర్ల చేతులు పడ్డాయి. ఆ ఇంజినీర్లు ఎవరు..? ఈవీఎంలను రిపేర్ చేశారా..? ఇంకేమైనా చేశారా..?. వాటికి రిపేర్లు.. టీడీపీకి గత ఎన్నికల్లో భారీగా ఓట్లు పడిన కేంద్రాల్లో ఎందుకు వచ్చాయి..? రిగ్గింగ్ చేసేశారా..? టెక్నాలజీతో చేయాల్సింది చేసేశారా..? ఇవన్నీ అనుమానాలే. పైగా.. ఓటర్లను ఓటు హక్కు వినియోగించుకోకుండా.. చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. సగానికి పైగా పోలింగ్ బూత్‌లలో మధ్యాహ్నం తర్వాతే పోలింగ్ ప్రారంభమయింది. ఈ ఎండల్లో ఓట్లు వేయరులే.. అనే భావనతో..ఈ కుట్ర చేశారు. ఏపీలో ఓ పార్టీని ఓడించడానికి.. అప్రజాస్వామికంగా చేసిన ప్రయత్నాలన్నీ కళ్ల ముందు ఉన్నాయి కాబట్టి… పై స్థాయిలో జరిగిన భారీ కుట్రగా భావించక తప్పదు.
ఏ రాష్ట్రంలోనూ.. ఈ తరహా రాజకీయం జరగలేదు. ప్రజాతీర్పును… ఓ పార్టీకి వ్యతిరేకంగా తీసుకు వచ్చి.. మరో పార్టీకి అనుకూలంగా వచ్చేలా చేసేందుకు.. ఎన్ని కుట్రలు చేయాలో అన్నీ చేశారు. భారతదేశ ప్రజాస్వామ్యం ఇప్పుడు… పతనావస్థకు చేరిందని దీనితోనే రుజువవుతోంది. వాళ్ల కుట్రలు ఫలిస్తే.. ప్రజల పేరుతో నియంతృత్వ పాలన రావడానికి ఎంతో సమయం పట్టదు..!