ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం అత్యంత దారుణంగా అపహాస్యం పాలవుతోంది. ఇప్పుడు ఉన్నది ఆపద్ధర్మ ప్రభుత్వం అన్నట్లుగా.. కొంత మంది నేతలు ప్రచారం చేస్తూ.. పాలనను.. ఎక్కడికక్కడ నిలిపివేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రిని పని చేయనివ్వకుండా చేస్తున్నారు. ఎన్నికల కోడ్ పేరుతో… ఆటంకాలు సృష్టించి.. ప్రజలకు ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.
ఆపద్ధర్మ ప్రభుత్వం ఎప్పుడు ఉంటుంది..?
ఆపద్ధర్మ ప్రభుత్వం అనేది.. ఓ ముఖ్యమంత్రి రాజీనామా చేసిన తర్వాత.. మరో ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేయాడనికి మధ్యలో ఉండేది ఆపద్ధర్మ ప్రభుత్వం. తెలంగాణ సీఎం కేసీఆర్.. ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి తన పదవికి రాజీనామా చేశారు. మళ్లీ.. ఎన్నికలయి.. కొత్త సీఎం ప్రమాణం చేసే వరకూ ఆయనే ఆపద్ధర్మ సీఎంగా ఉన్నారు. ఆయనే కొత్త సీఎంగా ప్రమాణం చేశారు. ఈ మధ్యలో కూడా ఆయనే సీఎంగా ఉన్నారు. దాన్ని ఆపద్ధర్మ ప్రభుత్వం అంటారు. ఎందుకంటే.. రాజ్యాంగపరంగా.. ఎలాంటి మెజార్టీ లేదు. అసెంబ్లీని రద్దు చేయడం వల్ల.. ఎలాంటి ఎమ్మెల్యేలు లేరు కాబట్టి.. కేవలం రాజ్యాంగపరమైన శూన్యత ఏర్పడకుండా ఆ ఏర్పాటు చేశారు. అధికార నిర్ణయాలు తీసుకోవడం నైతికత కాబట్టి.. నిర్ణయాలు తీసుకోలేదు. నిజానికి ఈ ఆపద్ధర్మం అనేది.. రాజ్యాంగంలో లేదు. ఉండేదల్లా నిజమైన ప్రభుత్వాలే. అయినప్పటికీ.. నైతికత మీద రాజకీయాలు.. ఆపద్ధర్మ ప్రభుత్వాల్ని నడిపిస్తున్నాయి.
ఏపీలో ఉన్న ఆపద్ధర్మం ఎలా అవుతుంది..?
ఏపీలో ఉన్నది ప్రజాప్రభుత్వం. ఐదేళ్ల పాటు పాలించడానికి 2014లో ప్రజలు తీర్పు ఇచ్చారు. దాని ప్రకారం.. ఏపీ ప్రభుత్వానికి ఐదేళ్ల పాటు అధికారం ఉంటుంది. అన్ని రకాల పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. పైగా సీఎం రాజీనామా చేయలేదు. ఎమ్మెల్యేల పదవీ కాలం కూడా పూర్తి కాలేదు. కాబట్టి.. ఆపద్ధర్మం అనే ప్రశ్నే రాదు. ఏపీలో ఇప్పుడు పూర్తి స్థాయి ప్రభుత్వం ఉంది. అది జూన్ ఎనిమిదో తేదీ వరకు ఉంటుంది. ఆ ప్రభుత్వానికి పూర్తి స్థాయి అధికారాలు ఉంటాయి. ఇది రాజ్యాంగపరంగా…ఏపీ ప్రభుత్వానికి వచ్చిన హక్కు.
మరి ప్రభుత్వాన్ని ఎందుకు పని చేయకుండా చేస్తున్నారు.. ?
ఎన్నికల సమయంలో.. రాజకీయ పార్టీలు అధికారాన్ని ఉపయోగించి అక్రమాలకు పాల్పడకుండా ఉండేందుకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను రూపొందించారు. ఓటర్లను ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకోకుండా దీన్ని రూపొందించారు. అందుకే.. ఎన్నికల ప్రకటన వచ్చిన తర్వాత ఇది అమల్లోకి వస్తుంది. అసలు విషయం ఏమిటంటే.. ఈ కోడ్ కౌంటింగ్ పూర్తయ్యే వరకూ అమల్లో ఉండటం. పోలింగ్ పూర్తయిన తర్వాత ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉండదు. చేసినా.. తీర్పు ప్రభావితం అయ్యే చాన్స్ ఉండదు. కానీ.. కౌంటింగ్ ముగిసేవరకూ కోడ్ అమలు అని ఉత్తర్వులు ఇవ్వడంతోనే అసలు సమస్య వచ్చింది. ఏపీలో మొదటి విడతలోనే ఎన్నికలు పెట్టేశారు. కౌంటింగ్‌కు నెలన్నర రోజులు సమయం ఉంది. ఈ మధ్య లో ప్రభుత్వాన్ని పని చేయకుండా చేస్తున్నారు. పదే పదే ఆరోపణలు చేస్తూ విపక్ష పార్టీ.. ఆ ఆరోపణలను సీరియస్‌గా తీసుకుంటూ.. ఈసీ ఏపీని రోడ్డున పడేసే ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఏపీలో ఆపద్ధర్మం అయితే.. కేంద్రంలోనూ అంతేగా..?
చీఫ్ సెక్రటరీని ఎన్నికల కమిషన్ బదిలీ చేయడం అనేది.. ఓ సంచలనాత్మకమైన చర్య. పోలింగ్ వారం రోజుల ముందు ఈ నిర్ణయం తీసుకున్నారు. అంత అవసరం ఏమిటో.. ఇప్పుడు అర్థం అవుతోంది. పోలింగ్ ముగిసిన తర్వాత రెండు నెలల పాటు ఏపీలో ఏ అధికారిక కార్యక్రమం జరగకుండా… ఈ బదిలీ చేసినట్లు తెలుస్తోంది. అంటే.. ప్రభుత్వాన్ని పని చేయనివ్వకుండా.. అభివృద్ధి పనుల్లో పురోగతి లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా చేయాలంటే.. ముందుగా.. కేంద్రాన్ని ఆపద్ధర్మ ప్రభుత్వంగా ప్రకటించాలి. దేశంలో ఉన్న ప్రభుత్వాలన్నింటినీ ఆపద్ధర్మంగా ప్రకటించాలి.