తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తనను.. బకరాను చేసే ప్రయత్నం చేశారని.. ఎన్నికల అధికారి రజత్ కుమార్ సైనీ మండిపోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల నిర్వహణ విషయంలో రజత్ కుమార్ కు పూర్తి అధికారాలు ఉంటాయి. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ, డీజీపీ సహా అందరూ.. ఆయన ఆదేశాల మేరకు పని చేయాల్సి ఉంటుంది. కానీ.. సైనీని పూర్తిగా లైట్ తీసుకున్న డీజీపీ మహేందర్ రెడ్డి… ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జగ్గారెడ్డి అరెస్ట్ నుంచి అనేక ఘటనలు చోటు చేసుకున్నా… రేవంత్ రెడ్డి అరెస్ట్ వ్యవహారంతో పోలీసుల తీరు ఒక్కసారిగా దేశం మొత్తం చర్చనీయాంశమయింది. ఈసీ పని తీరు ఇలా ఉందేమిటన్న చర్చ జరిగింది.
టెర్రరిస్ట్ ను అరెస్ట్ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ను.. అదీ కూడా అభ్యర్థిని ఎలాంటి కారణాలు లేకుండా అరెస్ట్ చేయడంతో తెలంగాణలో ప్రజాస్వామ్యబద్ధంా ఎన్నికలు జరగడం లేదన్న అభిప్రాయం దేశం మొత్తం ఏర్పడింది. మరో వైపు.. ఇదే వ్యవహారంలో.. కేంద్ర ఎన్నికల సంఘం… తెలంగాణ ఎన్నికల అధికారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. రేవంత్ అరెస్ట్ కు పర్మిషన్ ఎలా ఇచ్చారని మండిపడ్డారని చెబుతున్నారు. ఈ ఘటనతో .. తాను ఎన్నికల నాలుగైదు నెలలుగా పడుతున్న కష్టాన్ని ఎవరూ గుర్తించకపోగా.. తనకు చెడ్డ పేరు వచ్చిందని ఆయన మథన పడుతున్నారు. ప్రతీ రోజూ మీడియా ముందుకు వచ్చి ఎన్నికల ఏర్పాట్లను వివరించే రజత్ కుమార్.. రెండు రోజుల నుంచి మీడియాతో మాట్లాడేందుకు ఇష్టపడటం లేదు.
అదే సమయంలో రేవంత్ అరెస్ట్ ను సమర్థించుకునేందుకు ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ పదే పదే ఎన్నికల అధికారి రజత్ కుమార్ పేరు చెబుతున్నారు. ఆయన ఆదేశాలతోనే అరెస్ట్ జరిగిందని చెబుతున్నారు. కానీ.. నిజానికి టీఆర్ఎస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదును.. రజత్ కుమార్ సైనీ . డీజీపీకి పంపి.. తగు జాగ్రత్తలు తీసుకోమని సూచించారు. కానీ.. అలా డీజీపీ మాత్రం… అవకాశం దొరికిందని రేవంత్ రెడ్డిని లోపలేసేశారు. ఇప్పుడీ వ్యవహారం.. అటు ఈసీతో పాటు.. ఇటు డీజీపీకి చుట్టుకుంది. వికారాబాద్ జిల్లా ఎస్పీపై ఇప్పటికే వేటు పడింది.