నోట్లరద్దు సందర్భంలో లాగే ఇప్పుడు కూడా ఉభయ చంద్రులూ బిజెపి ముఖ్యమంత్రుల కన్నా ముందే జమిలి ఎన్నికలకు జండా వూపేశారు. అక్కడ చెప్పడానికి ముందే ఇక్కడ దాదాపు అధికారికంగా ఎన్నికల జ్వరం తెచ్చేశారు. గత మూడు సార్ల నుంచి నేను ఇదే చూస్తున్నాను. ప్రభుత్వాలు భారం తగ్గించుకోవడానికి, ఎన్నికలు వచ్చేస్తున్నాయన్న భావన పెంచడానికి పాకులాడుతున్నాయి. దానివల్ల వారికి ు ప్రయోజనాలున్నాయి. అన్నిటినీ ఎన్నికల పేరిట వాయిదా వేయొచ్చు.పార్టీ వారికి ఇవ్వాల్సిన పదవులు వంటివాటిని మరో దఫాకు నెట్టేయెచ్చు. ప్రజలలోనూ ఎన్నికల కోసం ఏదో చేస్తారన్న ఆశలు రేకెత్తించవచ్చు. ప్రతిపక్షాలను గజిబిజిలో పడేయొచ్చు. మొత్తం చర్చను ప్రభుత్వాల వైఫల్యాలు వెనుకబాట్ల నుంచి వచ్చే ఎన్నికల సమీకరణాలు ఫలితాలపై వూహాగానాల వైపు మరల్చవచ్చు. ఈ విషయంలో మోడి ప్రతిపాదన కన్నా ముందే ఇద్దరు ముఖ్యమంత్రులు స్పష్టమైన సంకేతాలివ్వడంలో ఉద్దేశం అదే. ప్రతిపక్షాల ఉద్యమాలు ఆందోళనలపై నుంచి ఎన్నికల పోటీ నిధుల సమీకరణ, టికెట్ల కేటాయింపు వంటి అంశాలపైకి వెళితే తమ అంతర్గత వ్యవహారాలు సర్దుకుని అవతలివారిపై వ్యూహాలు సంధించవచ్చు. గత ముప్పై ఏళ్లలో చూస్తే 1985,1994 మినహా తక్కిన అన్నిసార్లు తెలుగు నాట ఎన్నికలు లోక్‌సభతో పాటే జరిగాయి. 1989లో ఎన్టీఆర్, 2004లో చంద్రబాబు కూడా ముందే ముగించుకుని ముందస్తుకు వెళ్లడం ఓటమికే దారితీసింది. మరి ఇప్పుడెందుకు ఇంత వుబలాటపడుతున్నారో తెలియదు. ఎలాగూ జరుగుతాయి కనక మోడికి అనుకూలంగా వుంటే కొంత రాజకీయ సద్భావన పెరుగుతుందని అనుకునివుండొచ్చు. ఏది ఏమైనా అయిదేళ్ల కాలానికి ఎన్నికైన ప్రభుత్వాలు సగం కాలం పూర్తి చేసి ఎన్నికల జపం మొదలుపెట్టడం మాత్రం విపరీతమే. అజాగ్రత్తగా అధికారం పొగొట్టుకున్నామని తెలంగాణలో కాంగ్రెస్, ఎపిలో వైఎస్ఆర్సిపి మొదటి నుంచి బాధలో వున్నాయి గనక ముందస్తు వస్తే మంచిదనే అనుకుంటాయి. ఆహ్వానిస్తాయి. సో.. తెలుగు నాట ఇక ఎన్నికల రాగాలే తప్ప సాధారణ రాజకీయాలు తగ్గుముఖమే. ఎప్పుడూ ఎన్నికల చుట్టూ తిరగడం తగ్గిస్తామంటూనే ప్రధాని ముఖ్యమంత్రులు కూడా ముందస్తు ముచ్చట్లలో ముంచేయడం అన్నిటికన్నా తమాషా.