ఎన్నికల నగారా మోగింది. జనసేన లాంటి కొత్త పార్టీలతో పాటు, బాగా ఎస్టాబ్లిష్డ్ అయినా తెలుగుదేశం వైఎస్సార్సీపీ లకు కూడా ఈ షెడ్యూల్ శరాఘాతంలా తగిలింది. అభ్యర్థులను ఖరారు చేసే కసరత్తును అన్ని పార్టీలు వేగవంతం చేశాయి. పార్టీ అధినేతలు తామే స్వయంగా కొంతమంది ఇది నాయకులకు ఫోన్లు చేసి మరీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. కొత్త పార్టీ అయినా జనసేన క్యాడర్ తో పాటు, అధికార పార్టీ అయిన టిడిపి , ప్రతిపక్ష పార్టీ అయిన వై ఎస్ ఆర్ సి పి ల శ్రేణులు కూడా ఎన్నికలకు ఇంత తక్కువ సమయం ఉండడం ఏ ఫలితాలకు దారితీస్తుందో అన్న ఆందోళనలో ఉన్నారు.
ఇక ఏలూరు అసెంబ్లీ స్థానానికి వస్తే, తెలుగుదేశం పార్టీ నుండి మళ్లీ బడేటి బుజ్జి పోటీ చేయనుండగా, వైఎస్సార్సీపీ నుండి ఆలి నాని కి కి టికెట్ కన్ఫామ్ అయ్యింది. వీళ్ళిద్దరికీ ఎప్పటినుండో టికెట్ కన్ఫర్మ్ అయినప్పటికీ, జనసేన పార్టీ తరపున అభ్యర్థి ఎవరో తెలియక పోయినప్పటికీ, సామాజిక సమీకరణాల కారణంగా ఇక్కడ జనసేన పార్టీకి సానుకూలత ఉన్నట్లు తెలుస్తోంది.
జనసేన పార్టీ తరఫున రెడ్డి అప్పల నాయుడు అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలో చింతమనేనితో ఢీ అంటే ఢీ అని , ఒకానొక సమయంలో చింతమనేని కి ముచ్చెమటలు పట్టించిన రెడ్డి అప్పల నాయుడు కి స్థానికంగా బలమైన వ్యక్తిగా పేరుంది. జనసేన పార్టీ తరఫున రెడ్డి అప్పల నాయుడు గనుక పోటీ చేస్తే కచ్చితంగా పార్టీకి మరింత సానుకూలంగా ఉండవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ఇక సామాజిక సమీకరణాల పరంగా చూసినా, బడేటి బుజ్జి, ఆలీ నాని, రెడ్డి అప్పల నాయుడు ముగ్గురు దాదాపు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. బడేటి బుజ్జి, ఆలీ నాని కాపు సామాజిక వర్గానికి చెందిన వారైతే, అప్పలనాయుడు ది తూర్పు కాపు సామాజిక వర్గం. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ సిపి తరపున కాపు అభ్యర్థులే నిలబడినప్పటికీ కాపు ఓటర్లు జనసేన పార్టీ వైపే మొగ్గు చూపవచ్చని, ఆ రకంగా చూస్తే కాపు సామాజిక వర్గం ప్రబలంగా ఉన్న ఏలూరు లో జనసేన పార్టీకి గెలిచే అవకాశం ఎక్కువగా ఉందని భావిస్తున్నారు.
అలాగే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు ఎప్పుడూ ప్రభుత్వ వ్యతిరేకత అన్న ఒక నెగటివ్ పాయింట్ ఉంటుంది. బడేటి బుజ్జి మీద కూడా అదే తరహా వ్యతిరేక కాస్త ఉంది. ఇక ఆలి నాని విషయం చూస్తే గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఈయన వైఎస్ఆర్ సిపి తరపున ఎమ్మెల్సీ కోసం పట్టుబట్టారు. ఒకానొక సమయంలో పార్టీ మీద అలిగి మరి ఎమ్మెల్సీ సాధించుకున్నారు. ఈయన ఎమ్మెల్సీగా వెళ్లిపోవడంతో వైఎస్సార్సీపీ తరఫున ఈశ్వరీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని పార్టీ శ్రేణులు భావించాయి. నియోజకవర్గ బాధ్యతలు కూడా గత రెండేళ్లకు పైగా ఆవిడ చూసుకున్నారు. అయితే ఆఖరి నిమిషంలో లో జగన్ ఆవిడకు హ్యాండ్ ఇచ్చి నాని ని తెరమీదకు తీసుకువచ్చారు. గత రెండేళ్లుగా నియోజకవర్గానికి కాస్త దూరంగా ఉన్నా ఆలి నాని ఇప్పుడు మళ్లీ ఎన్నికల సమయం లో నియోజకవర్గంలో లో యాక్టివ్ అవుతున్నప్పటికీ ఎంతవరకూ ప్రజల ఓట్లు సంపాదిస్తాడు అన్నది సందేహాస్పదంగా మారింది.
జనసేన పార్టీ ఇప్పటికీ అప్పలనాయుడు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయకపోయినప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ఈయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే చింతమనేనితో గతంలో ఈయన బలంగా ఢీకొన్న కారణంగా ఈయనను దెందులూరు కు పంపిస్తారేమో అన్న చర్చ కూడా నడుస్తోంది. కానీ ఏలూరు నుండి ఈయన పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి సామాజిక సమీకరణాల కారణంగా, పవన్ కళ్యాణ్ కు ఈ నియోజకవర్గంలో ఉన్న సానుకూలత కారణంగా, ఏలూరు సీటు జనసేన కైవసం చేసుకుంటుందా లేదా అన్నది మే 23న తెలుస్తుంది.
– జురాన్ (@CriticZuran)