స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తెనపల్లి నియోజకవర్గం రాజకీయ పరిశీలకులకు ఆసక్తికరంగా మారింది. ఎవరు గెలుస్తారు అన్న విషయాన్ని పక్కన పెడితే ఈసారి అసలు ఎవరు పోటికి నిలబడతారు అన్న విషయం కూడా ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.
ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న శివప్రసాద్ అసలు నియోజకవర్గం అయితే నరసరావుపేట నియోజకవర్గం. 2014లో ఆస్థానం పొత్తు లో భాగంగా బిజెపికి కేటాయించడంతో ఆయన సత్తెనపల్లి వచ్చారు. వైఎస్ఆర్ సిపి అభ్యర్థి అయిన అంబటి రాంబాబు మీద స్వల్ప మెజారిటీతో తో గెలిచారు. అయితే ఈసారి బిజెపితో పొత్తు లేకపోవడంతో తాను తన సొంత నియోజకవర్గమైన నరసరావుపేట నుండి పోటీ చేయాలని ఆయన ఆశపడుతున్నారు. అదే సమయంలో సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు, తన కుమారుడిని టిడిపి టికెట్ మీద సత్తనపల్లి నుండి పోటీ చేయించడానికి పావులు కదుపుతున్నారు.
ఇక ఇక్కడ ఓడిపోయిన అంబటి రాంబాబు కి వైఎస్ఆర్ సిపి తరపున మళ్ళీ టికెట్ వస్తుందా లేదా అన్న విషయం కూడా స్పష్టత రావడం లేదు. అంబటి రాంబాబు కి టికెట్ ఇవ్వవద్దంటూ రెడ్డి సామాజిక నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు ఆ మధ్య నియోజకవర్గంలో సభలు నిర్వహించడం , అది కాస్తా జగన్ దృష్టికి వెళ్లడం తెలిసిందే. ఇప్పటి దాకా అంబటి రాంబాబు కి జగన్ ఏమి చెప్పకపోవడంతో అంబటి రాంబాబు కూడా డైలమా లోనే ఉన్నారు.
ఇక జనసేన తరపున బైరా దిలీప్ చక్రవర్తి ఈసారి ఇక్కడ నుండి పోటీ చేయబోతున్నారు. ప్రజారాజ్యం తరఫున 2009లో పోటీ చేసి ఓడిపోయిన ఈ మాజీ బ్యూరోక్రాట్, గత కొద్ది రోజులుగా నియోజకవర్గంలో చురుకుగా ఉంటూ తన పని తాను చేసుకు పోతున్నారు. పైగా ఆ మధ్య తన సొంత ఛానల్ కూడా ప్రారంభించారు. జనసేన నుండి ఈయన కాకుండా ఇంకెవరు కనిపించడం లేదు కాబట్టి జనసేన తరపున ఈయన పోటీ చేయడం ఖాయం అనిపిస్తుంది.
మరి ఈ ట్విస్ట్ ల మధ్య సత్తెనపల్లి నియోజకవర్గం లో ఎవరి పోటీకి నిలబడతారు, ఎవరు గెలుస్తారో అని తెలియాలంటే ఎన్నికలయ్యేదాకా వేచి చూడాలి.