రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక జరిగే అవకాశాలు లేవనే ఈ మధ్య పరిస్థితి కనిపించింది. కానీ, అనూహ్యంగా ఎన్నిక నిర్వహించడానికి సన్నద్ధమౌతున్నారు! ఈనెల 9న ఎన్నిక ప్రక్రియ ఉంటుందనీ ప్రకటన వచ్చేసింది. అంటే, 8వ తేదీ మధ్యాహ్నంలోపు నామినేషన్లు వేయాల్సి ఉంటుంది. అయితే, ఈ పదవి కోసం భాజపా నేరుగా పోటీ పడకుండా, ఎన్డీయే మిత్రపక్షాల నుంచి ఒకర్ని బరిలోకి దింపాలని భావిస్తోంది. ఈ నేపథ్యంటో జేడీయూ నాయకుడు హరివంశ్ నారాయణ్ సింగ్ ను బరిలోకి దింపే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. దీనిపై అధికారికంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఈ ఎన్నికలో నెగ్గాలంటే 120 మంది రాజ్యసభ సభ్యులు అవసరమౌతారు. ఎన్డీయేతోపాటు అన్నాడీఎంకే సభ్యుల్ని కలిపి చూసుకున్నా కూడా 106 మంది మద్దతు మాత్రమే కనిపిస్తోంది. అయితే, ప్రతిపక్షాల్లో కూడా ఎన్డీయేకి అనుకూలంగా వ్యవహరించేవారు కొంతమంది ఉండొచ్చనే అంచనాలున్నాయి. అందుకే, సొంతంగా భాజపా అభ్యర్థిని బరిలోకి దించడం లేదు! ఒకవేళ భాజపా నుంచే అభ్యర్థి వస్తే… వ్యతిరించేవారు పెరుగుతారనీ, ఎన్డీయే మిత్రపక్షానికి అవకాశం ఇస్తే కొంత తగ్గుతారనే అభిప్రాయంతోనే జేడీయూకి అవకాశం ఇచ్చేందుకు భాజపా అధినాయకత్వం మొగ్గు చూపుతున్నట్టు చెప్పుకోవచ్చు.
విపక్షాల నుంచి పోటీ తప్పదనే అనిపిస్తోంది. అభ్యర్థి ఎవరూ, ఏ పార్టీ నుంచి వస్తారనేది ఇంకా తేలాల్సి ఉంది. అయితే, విపక్షాలన్నీ ఏకమైతే… ఎన్డీయే అభ్యర్థిపై ఈ ఎన్నికలో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనీ చెప్పుకోవచ్చు. ఎన్డీయేతో పోల్చుకుంటే ఓ పదిమంది సభ్యులు ఎక్కువగానే ఉన్నారు. సో.. ఓ రకంగా చూసుకుంటే ప్రతిపక్షాల ఐక్యతకు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక మరో వేదికగా మారే అవకాశం ఉంది. ఆయా పార్టీల మధ్య ఐక్యతకు కూడా ఇదొక పరీక్షే అనడంలో సందేహం లేదు. ఎందుకంటే, ఆ మధ్య కర్ణాటకలో వివిధ పార్టీల నాయకులు ఒకే వేదికపైకి వస్తే… ఆ పార్టీల మధ్య భావసారూప్యత లేదనీ, ఎన్నికల వరకూ కలిసికట్టుగా వెళ్లేంత సయోధ్య వారి మధ్య సాధ్యం కాదని భాజపా నేతలే విమర్శించారు.
అయితే, రాజ్యసభలో విపక్షాలు బలంగా ఉన్న నేపథ్యంలో… ఓటమి తప్పదనే వాతావరణం కనిపిస్తున్నప్పుడు డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికకు భాజపా ఎందుకు సిద్ధపడుతున్నట్టు అనేదే ఆసక్తికరంగా మారుతోంది. కావాల్సిన సంఖ్యాబలాన్ని సాధించుకోగలం అనే నమ్మకం భాజపా బాగానే ఉన్నట్టుంది! అయితే, అది ఎక్కడి నుంచి వస్తుందనేదే ఇప్పుడు చర్చ! అయితే, వ్యూహాత్మకంగా విపక్షాలకు ఎక్కువ సమయం ఇవ్వకుండా ఎన్నిక నిర్వహించడం కూడా ఒక ఎత్తుగడగానే చూడాలి. ఎందుకంటే, ఒక్కరోజులోనే విపక్షాల అభ్యర్థి ఎవరనేది ఖరారు కావాలి, ఆ అభ్యర్థిని ఎంపిక చేసేందుకు పార్టీలన్నీ ఒక తాటి మీదికి రావాలి, అభ్యర్థి విషయంలో భిన్నాభిప్రాయాలు తలెత్తితే సర్ది చెప్పుకోవాలి! ఈ గందరగోళం నుంచి పార్టీలు బయటపడే లోపుగానే ఎన్నిక ముగించేద్దామని సర్కారు భావించినట్టు అనుకోవచ్చు!