నాగార్జున సాగర్ ఉపఎన్నికకు సంబంధించి ప్రచార గడువు నేటితో ముగుస్తుంది. సాయంత్రం ఐదు గంటల తర్వాత అందరూ మైకులు బంద్ చేసి.. ఇంటి ముఖం పట్టాల్సి ఉంటుంది. కానీ మీ ఓటు మాకే అనే ప్రచార హోరు మాత్రం ఆగదు. ఎందుకంటే… మినీ మున్సిపల్ సమరానికి తెలంగాణ సర్కార్ సిద్ధమయింది. రెండు కార్పొరేషన్లతో పాటు కొన్ని మున్సిపాల్టీలకు ఏ క్షణమైనా నోటిఫికేషన్ విడుదల కానుంది. దీంతో ప్రచార హంగామా ప్రారంభమవుతుంది. ముఫ్పైవ తేదీ పోలింగ్ జరుగుతుంది. నాగార్జున సాగర్ ఉపఎన్నిక ముగిసిన తర్వాత మే రెండో తేదీన కౌంటింగ్ జరుగుతుంది. ఆ రోజుకల్లా ఫలితాలు వచ్చేలా షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు.
రెండు కార్పొరేషన్లు, కొన్ని మున్సిపాల్టీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఖమ్మం , వరంగల్ కార్పొరేషన్లపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ఆయా జిల్లాల నేతలు ఇప్పటికే అక్కడ గ్రౌండ్ వర్క్ కూడా పూర్తి చేశారు. ఓ వైపు సాగర్ ప్రచారం జరుగుతున్నా..కేటీఆర్ మాత్రం పూర్తిగా ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లపైనే దృష్టి పెట్టారు. తరచూ అక్కడికి వెళ్లి పథకాలు ప్రకటించి వస్తున్నారు. ఇతర పార్టీలపై విమర్శలు చేస్తున్నారు. తెలంగాణలో పరిస్థితి తెలంగాణ రాష్ట్ర సమితికి పూర్తి అనుకూలంగా ఉందని.. ఇతర పార్టీలు ఏవీ పుంజుకోలేదని.. స్పష్టమైన సంకేతాలను ప్రజల్లోకి పంపాలని.. టీఆర్ఎస్ పట్టుదలగా ఉంది.
అందుకే వ్యూహాత్మకంగా.. సాగర్ ఫలితాలు వచ్చే ఒకరో జు.. అటో ఇటో … మున్సిపల్ ఎన్నికల ఫలితాలువచ్చేలా చూసుకుంటోంది. గాలి ఏకపక్షంగా ఉందని నిరూపించాలన్న పట్టుదలతో కేటీఆర్ కూడా ఉన్నారు. సాగర్‌లో కేసీఆర్ ప్రచారంతో… గెలుపు ఖాయమని టీఆర్ఎస్ గట్టి నమ్మకంతో ఉంది. అక్కడ ఆయన కాంగ్రెస్‌నే టార్గెట్ చేశారు కానీ.. బీజేపీ ప్రస్తావన కూడా చేయలేదు. ఖమ్మం, వరంగల్లోనూ అదే వ్యూహం పాటిస్తారా లేకపోతే.. మళ్లీ బీజేపీని హైలెట్ చేస్తారా అన్నది ఆసక్తికర విషయంగా మారింది.