తెలంగాణకు సంబంధించినంత వరకు ఎన్నికల సంఘం వ్యవహార సరళి చాలా కాలంగా రకరకాల విమర్శలకు గురవుతూ వస్తోంది. మామూలుగా అయితే.. ఎన్నికల సంఘం అనేది రాజకీయ వాసన కకూడా అంటకుండా ఉండవలసిన తటస్థ స్వతంత్ర సంస్థ. అయితే అధికారంలో ఉన్న తెరాసకు ప్రస్తుత ఎన్నికల సంఘం అనుకూలంగా ఉన్నదని గానీ, వారి తప్పులను ఉపేక్షిస్తున్నదని గానీ.. విపక్షాలు చాలా కాలంగా గోల చేస్తున్నాయి. తాజాగా గ్రేటర్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా జరిగిన రభసలు కూడా మరోవైపు ప్రభుత్వేతర పార్టీలన్నీ ఎన్నికలసంఘంవైపు వేలెత్తి చూపే పరిస్థితిని సృష్టించాయి.
పైగా చెలరేగిపోయిన మజ్లిస్ గూండాల చేతిలో దెబ్బలు తిన్న నాయకులు సహజంగానే ఎన్నికల సంఘం వైఫల్యాల మీద ఆరోపణలు ఉన్నప్పుడు వారి వద్ద ఆవేశంంగా స్పందించడం సహజం. అయితే చిత్రమైన రీతిలో.. ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి కూడా సంయమనం మరచి రాజకీయ నాయకులతో తగాదాకు దిగడమే, వాగ్వాదానికి పూనుకోవడమే చిత్రమైన పరిణామం.
మజ్లిస్ చేతిలో నాయకులు దెబ్బలు తిన్న తర్వాత.. అఖిలపక్షం ఆధ్వర్యంలో అందరూ కలిసి అటు గవర్నరుకు, ఇటు ఎన్నికల అధికారి నాగిరెడ్డికి నివేదించుకున్న సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా తమ ఆవేదనను ఎన్నికల అధికారికి తెలియజేయడంలో భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తాము ఎదుర్కొన్న దాడుల గురించి, ఎన్నికల సంఘం వైఫల్యాల గురించి ఆవేశంగానే ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కనీసం అధికారి వైపునుంచి అయినా సంయమనం పాటించి ఉంటే సరిపోయేది. కానీ నాగిరెడ్డి కూడా రెచ్చిపోయారు. అటు అధికారి నాగిరెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ల మధ్య వాగ్వాదం తారస్థాయికి చేరుకున్నది.
ఇద్దరూ తీవ్రస్థాయిలో వాదులాడుకుంటూ ఉంటే.. ఇతర నాయకులు జోక్యం చేసుకుని.. ఇరువురిని శాంతింపజేసి.. ఇద్దరికీ కరచాలనం చేయించి సర్దిచెప్పాల్సి వచ్చింది. మజ్లిస్‌పై ఫిర్యాదుచేసి నాయకులు వచ్చేసారు. నిజానికి ఇలాంటి సునిశితమైన సందర్భాల్లో అధికారులుకూడా సంయమనం కోల్పోతే ఎలా అని నాయకులు వ్యాఖ్యానించడం విశేషం. ఈ వ్యవహారంపై మరో వ్యాఖ్య ఏంటంటే.. నిజానికి పురానాపూల్ రీపోలింగ్ నిర్ణయం అయినా.. ముందే వచ్చి ఉండాల్సిందని.. ఎన్నికల సంఘం ముందే ఇచ్చి ఉండాల్సిందని.. అలా కాకుండా, అఖిలపక్షం నాయకులు వెళ్లి రభస అయిన తర్వాత మాత్రమే.. వారు ఏదో ఒకటి చేయకపోతే చెడ్డపేరు తప్పదనే భయంతో రీపోలింగ్‌కు ఆదేశించారని పలువురు అనుకుంటున్నారు.