రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మంచి జోష్ ను ఇచ్చాయి. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఈ ఎన్నికల ఫలితాలు బాగా ఊరట ఇచ్చినట్టే లెక్క! ఎలా అంటే, ఆయన ఎక్కడికి వెళ్తే ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతోందనీ, ఐరన్ లెగ్ అంటూ ఆ మధ్య భాజపా బాగానే ప్రచారం చేసింది. ఆ మేరకు కొన్ని చోట్ల ఫలితాలు కూడా అలానే ఉంటూ వచ్చాయి. కానీ, ఈ మూడు రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి… కాంగ్రెస్ పరిస్థితి వేరేలా ఉంది. లోక్ సభ ఎన్నికలకు ముందు జరిగే ఈ ఎన్నికల్ని సెమీ ఫైనల్స్ అనే చెప్పాలి. ఇంతటి కీలకమైన సమయంలో.. భాజపా పాలిత రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాగా వేయడం, అదీ రాహుల్ సారథ్యంలో జరగడం ఆయన ఇమేజ్ కి కొత్త నిర్వచనంగా మారిందని చెప్పొచ్చు.
ఎన్నికల ఫలితాల అనంతరం మీడియాతో రాహుల్ గాంధీ మాట్లాడుతూ…. దేశంలోని సమస్యల్ని పరిష్కరించే స్థాయిలో ప్రధానమంత్రి లేరనీ, సమస్యల నుంచి ఆయన పారిపోతున్నారనీ, ఆ విషయం ప్రజలు గ్రహించారన్నారు. దేశ ప్రజలకు చేసిన వాగ్దానాలేవీ మోడీ నెరవేర్చలేకపోయారన్నారు. కాంగ్రెస్ ముక్త భారత్ అంటూ వినిపిస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నామనీ, ఈ దేశం నుంచి ఏ పార్టీనీ తరిమేసే ఆలోచన తమకు లేదనీ, తమ విధానం అది కాదన్నారు. నోట్ల రద్దు అనేది పెద్ద కుంభకోణమనీ, రాఫెల్ డీల్ గురించి తెలిసిందేననీ, ఆర్థిక వ్యవస్థను మోడీ సర్కారు నాశనం చేసిందనీ, ఆర్బీఐ గవర్నర్ రాజీనామా చేసిన పరిస్థితి దేశంలో ఉందన్నారు. ప్రజలందరూ ఒక విజన్ తో మోడీకి అవకాశం ఇచ్చారనీ, ప్రజల ఆశల్ని నెరవేర్చడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారన్నారు.
2014 ఎన్నికలు తనకు చాలా నేర్పించాయనీ, దేశ ప్రజల గుండె చప్పుడు వినాలనీ, దాని అనుగుణంగా నడుచుకోవాలని నేర్చుకున్నా అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా కొన్ని పాఠాలు నేర్పించారంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఏం చెయ్యకూడదో తనకు ఆయన ద్వారానే బాగా తెలిసిందన్నారు! దేశం ఆయనకి గొప్ప అవకాశం ఇచ్చిందనీ, కానీ ప్రజల గుండె చప్పుళ్లను ఆయన వినలేదనీ, యువత, రైతులు ఏం చెబుతున్నారో వినలేదన్నారు. ఆయనలో అహం పెరిగిపోయిందనీ, అది ఉండదకూడదని తనకు నేర్పించిన గురువు మోడీ అన్నారు. తెలంగాణ, మిజోరాంలలో గెలవలేకపోయామనీ, గెలిచిన పార్టీలకు అభినందనలు తెలిపారు రాహుల్.
ఈ ఫలితాల తరువాత ఒక పరిపక్వమైన నాయకుడిగా రాహుల్ వ్యవహరించారు అనొచ్చు. లేనిపోని కామెంట్లు చేస్తూ, పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులు కొని తెచ్చుకున్న రాహుల్ గాంధీ… ఇవాళ్ల ప్రధాని మోడీపై సున్నితంగా సెటైర్లు వేస్తూ, తన మెచ్యురిటీని ప్రదర్శించే ప్రయత్నం చేశారు.