ఈ నెలాఖరులోనే పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాలకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగే ఒడిషాలో ఈసీ కమిషనర్లు పర్యటించారు. సన్నద్ధతపై మాట్లాడారు. అన్ని రాష్ట్రాల్లోనూ.. పూర్తి స్థాయిలో ఎన్నికల నిర్వహణకు సిద్ధమయ్యామని చెప్పారు.
2019 సాధారణ ఎన్నికల షెడ్యూల్ మార్చి పదో తేదీన ఇచ్చారు. ఈ సారి పది రోజుల ముందుగా ఇవ్వబోతున్నారని కొంత కాలంగా చర్చ జరుగుతోంది. లోక్‌సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకూ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ క్రమంలో ఆరేడు దశల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది కాబట్టి … ఎండలు.. పరీక్షలు వంటి వాటిని దృష్టిలో పెట్టుకుని.. ఓ పది రోజుల ముందుగా షెడ్యూల్ ప్రకటిస్తే బెటరని అనుకుంటున్నారు. ఇప్పటికే పోలింగ్ తేదీలతో సహా మొత్తం ఓ ప్రణాళిక రెడీ చేసుకున్నారు. వాటిని ఫైనల్ చేసి ప్రకటించాల్సి ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల్లో మొదటి విడతలోనే పూర్తవుతాయి. గతంలో అంతే జరిగాయి. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో జమిలీ ఎన్నికలు జరగాల్సి ఉంది. కేసీఆర్ గతంలో ఆరు నెలల ముందుగా ఎన్నికలకు వెళ్లడంతో.. ఎన్నికలు మూర్తయిన మూడు నెలల్లోనే లోక్ సభ ఎన్నికలను తెలంగాణలో విడిగా నిర్వహించాల్సి వస్తోంది. ఏపీలో మాత్రం జమిలీ ఎన్నికలు జరుగుతాయి. నెలాఖరులో ఎన్నికల షెడ్యూల్ వస్తే.. ఏప్రిల్ రెండో వారంలో ఏపీలో పోలింగ్ ఉండే అవకాశం ఉంది.