ఆంధ్రప్రదేశ్లో కరుణామయులు ఎక్కువైపోయారు. నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు. భోజనం పెడుతున్నారు. చిన్న చిన్న అవసరాలు కూడా చేస్తున్నారు. కరోనా కారణంగా.. డబ్బు శాశ్వతం కాదు.. మానవత్వమే ముఖ్యమని.. జ్ఞాననేత్రాలు తెరుచుకోవడం ద్వారా.. ఇలా సాయం చేసేస్తున్నారా.. అని చాలా మందికి డౌట్ వస్తుంది. కానీ అసలు విషయం అది కాదు.. స్థానిక ఎన్నికలు. ఇలా పంచుతున్న వారందరూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన వారు.. పోటీ చేస్తున్న అభ్యర్థులకు చెందిన వారు.. ఆయా పార్టీల వారే.
మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో దాతృత్వ హవా మామూలుగా లేదు. అన్ని పార్టీల నేతలు… పోటీ పడి మరీ.. తమ బొమ్మలు ముద్రించుకుని మరీ రెడీ చేసిన సంచుల్లో నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు. నేరుగా ఓట్లు అడగకపోయినా… ఆకలి తీరుస్తున్నాం.. మమ్మల్ని గుర్తుంచుకోండని చెప్పి వస్తున్నారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు.. నామినేషన్ల పర్వం దగ్గరకు వచ్చి ఆగిపోయాయి. ఎక్కడ ఆగిపోయాయో.. అక్కడ్నుంచి ప్రారంభిస్తామని స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ప్రకటించారు. అదే సమయంలో విపత్తు వచ్చి పడింది. మొదట్లో నిరాశపడిన రాజకీయ నేతలు… విపత్తు కారణంగా సాయం పంచేయవచ్చన్న వెసులుబాటు రావడంతో జూలు విదిలించారు. ప్రభుత్వమే దీనికి మార్గం చూపించింది. ప్రభుత్వం తరపున ఇవ్వాల్సిన రూ. వెయ్యిని వైసీపీ నేతలు పంపిణీ చేసి నేరుగా ఓట్లు అడిగారు. దాంతో అందరికీ ఐడియా వచ్చేసింది. పోలోమంటూ.. పంపకాలు ప్రారంభించారు.
ప్రజలను ఆదుకునే పేరుతో.. ప్రస్తుతం.. ఆంధ్రప్రదేశ్ మొత్తం పంపకాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ స్థాయి నాయకులు కోట్లు వెచ్చిస్తున్నారు. చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. ఒక్క రోజులోనే ఏకంగా రూ. రెండు కోట్లు ఖర్చు చేసి పదివేల కుటుంబాలకుపైగా నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఇతర నియోజకవర్గాల్లో పరిస్థితి అంతే ఉంది. స్థానిక అభ్యర్థులు బలంగా ఉన్న చోట ఈ పంపిణీ అధికంగా ఉంది. అన్ని పార్టీల నేతలు..ఈ పంపకాల్లో బిజీగా ఉన్నారు. కొంత మంది అన్న క్యాంటీన్ల తరహాలో ఉచిత భోజనాలు కూడా పెట్టేస్తున్నారు.
సాధారణంగా పది రోజుల్లో ఎన్నికలు అయిపోతే నేతలకు ఇంత ఖర్చు ఉండేది కాదు. కానీ ఇప్పుడు.. ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎప్పుడు జరుగుతాయో కూడా తెలియదు. కానీ.. ఖర్చులు మాత్రం నిరంతరాయంగా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొసమెరుపేమిటంటే.. ఎన్నికలు ఏకగ్రీవం అయినచోట్ల ఈ దాతృత్వ హృదయాలు స్పందించడం లేదు. లైట్ తీసుకున్నాయి.