పంద్రాగస్టు వేడుకలు అధికార పార్టీలకు ఎన్నికలు సభలుగా ఉపయోగపడ్డాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అదే తరహాలో ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అయితే…. పదేళ్లలో చేసిన దాని గురించి తక్కువగా చెప్పుకుని.,. తర్వాత చేయబోయేదాని గురించి ఎక్కువగా చెప్పుకున్నారు. వచ్చేసారి ఆగస్టు 15న ఈ ఎర్రకోట నుంచి దేశం సాధించిన విజయాలను, సాధించబోయే విజయాలను వివరిస్తానని చెప్పుకొచ్చారు. మీరు బాధపడుతుంటే చూడలేను అని ఆవేదన వ్యక్తం చేశారు.
వచ్చే ఐదేళ్లు కీలకం – ప్రజల సాయం కావాలన్న మోదీ
2014లో మార్పు తెస్తానని హామీ ఇచ్చానని ఆ నమ్మకాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించానన్నారు మదీ. అయితే వచ్చే ఐదేళ్లు కీలకం అని ఐదేళ్లలో అపూర్వమైన అభివృద్ధి జరుగుతుందని ప్రధాని మోదీ అన్నారు. ఎర్రకోట నుంచి మీ సాయం కోరేందుకు వచ్చానని, మీ ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చానని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో ప్రధాని మోదీ గత ప్రభుత్వాలను టార్గెట్ చేశారు. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన కుంభకోణాలను ప్రస్తావిస్తూ అవినీతి భూతాలు దేశాన్ని వెంటాడుతున్నాయన్నారు. అవినీతి పరుల సంగతి తేలుస్తానన్నారు. కానీ పదేళ్లలో ఆయన ఎంత తేల్చారో.. ఎంతగా కాపాడారో… కాపాడుకున్నారో కళ్ల ముందే ఉందన్న సెటైర్లు సహజంగానే వినిపిస్తున్నాయి.
కేసీఆర్ వరాలే వరాలు
హైదరాబాద్లో జాతీయ జెండా ఎగుర వేసిన కేసీఆర్ ఉద్యోగులకు వరంగ ప్రకటించారు. కొత్త పీఆర్సీ నియమించి ఉద్యోగుల వేతనాలు పెంచుతామని అన్నారు. అప్పటి వరకు మధ్యంతర భతి చెల్లిస్తామని స్వయంగా ప్రకటించారు. సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి బోనస్ గా వెయ్యి కోట్ల రూపాయలు పంపిణీ చేస్తామన్నారు. వచ్చే 3 నుంచి నాలుగు ఏళ్లలో మెట్రో రైల్ విస్తరణ పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు. ఎప్పట్లాగే హామీలు. పథకాలన్నీ వల్లె వేశారు. దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు, బలహీన వర్గాల జీవితాల్లో అలుముకున్న పేదరికం ఇప్పటికీ తొలగిపోలేదని వారికి మేలు చేస్తామన్నారు. రుణమాఫీ గురించీ గొప్పగా చెప్పారు.
అరిగిపోయిన మూడు రాజధానుల రికార్డు వినిపించిన జగన్
రాజధానులు హక్కుగా మూడుప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామని పాత కథను కొత్తగా వినిపించారు జగన్. ఇక ఆయన ప్రసంగంలో పాత రొట్ట హామీలన్నీ వినిపించారు. నాలుగున్నరేళ్లలో చేసిందేమిటంటే… ఆ పథకాలకు డబ్బులిచ్చా.. ఈ పథకాలకు డబ్బులిచ్చా.. అని చెప్పుకోవడం తప్ప.. కొత్తగా ఏమీ చెప్పుకోలేకపోయారు. ఎన్నికలకు వెళ్లే ముందు చివరి పంద్రాగస్టు.. ప్రజలకు ఏమి చేస్తారో కూడా చెప్పుకోలేకపోయారు.