రాజకీయాల్లో “సమీప” ప్రత్యర్థులు ఎక్కువగా ఉంటారు. అయితే ఇప్పుడు ఆ సమీప ప్రత్యర్థులు ప్రధాన పార్టీలకు చెందిన వారే అయి ఉండాలని లేదు. ఒక్కో సారి పోలింగ్ అయిపోయిన తర్వాత ఎవరో తెలియని ఆ ప్రత్యర్థులు తమ పాలిట విలన్లుగా మారారని మాత్రమే గుర్తించగలరు. ఎందుకంటే.. వారు తమ గుర్తుల ద్వారానే ఆ హోదాను తెచ్చుకుంటాయి. ప్రధాన పార్టీల అభ్యర్థుల గుర్తులను పోలి ఉండే గుర్తులు ఉన్న ఇండిపెండెంట్లు కొన్ని చోట్ల ఎన్నికల్లో ఫలితాలను తారుమారు చేస్తూంటారు. హుజురాబాద్‌లోనూ అదే పరిస్థితి కనిపిస్తోది.
హుజూరాబాద్ బరిలో ప్రధాన పార్టీలైన బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ కాకుండా ఇతరులు 27 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. హోరాహోరీగా పోరు సాగుతోందని .. ఎవరు గెలిచినా మెజార్టీ తక్కువేనన్న అంచనాలు ఉన్నాయి. పఇలాంటి సమయంలో ఇండిపెండెట్లు ఎక్కడ తమ గెలుపు అవకాశాలను దెబ్బతీస్తారోనని బీజేపీ, టీఆర్ఎస్ భయపడుతున్నాయి. కారు, కమలం గుర్తులను పోలిన చిహ్నాలు పొందిన వారు కూడా ఈ జాబితాలో ఉండటమే దీనికి కారణం. ఈవీఎంలు ఉండే గదుల్లో తక్కువ లైటింగ్ ఉంటుంది. అందుకే కంగారులో ఏ గుర్తుపై ఓటేస్తారో తెలియని పరిస్థితి ఉంటుంది.
దుబ్బాకలో టీఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఇండిపెండెంట్ అభ్యర్థి. ఆ ఉప ఎన్నికలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఓట్ల తేడా కేవలం 1,400 మాత్రమే. ఉప ఎన్నికలలో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి అత్యధికంగా 3,500 ఓట్లు వచ్చాయి. అతనితో పాటు అదే ఎన్నికల్లో పోటీ చేసిన మరికొందరు స్వతంత్రులకు 500 నుంచి 2 వేల ఓట్ల వరకు పడ్డాయి.. వీరికి కారును పోలిన గుర్తులు రావడమే కారణం. అందుకే రాజకీయ పార్టీలు ప్రధానంగా గుర్తుపై అవగాహన పెంచేందుకు గ్రామాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నాయి.