ఎన్నికల సంఘం అంటే.. రాజ్యాంగబద్ధ సంస్థ. పవర్ ఫుల్. ఎన్నికల నిర్వహణలో.. ఆ సంస్థకు ఉన్న అధికారాల ముందు ప్రధాని పవర్ కూడా బలాదూర్. కానీ.. మన దేశంలో ఈసీ ఎం చేస్తోంది..? పైకి.. సూపర్ స్వేచ్చను అనుభవిస్తున్నాం.. నిష్పక్షిపాతంగా… విధులు నిర్వహిస్తున్నామని స్వయం సర్టిఫికెట్లు ఇచ్చుకుంటూ.. అధికార పక్షానికి… తొత్తుల్లా వ్యవహరిస్తోంది. దీనికి నిన్న జరిగిన మూడు ఘటనలో సాక్ష్యం.
మొదటిది.. మూడు గంటలకు ప్రెస్మీట్ నిర్వహించడం. ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ ఓపీ రావత్… శనివారం రాత్రి విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. వచ్చే సరికి పదో తేదీ అవుతుంది. ఓ పనైపోతుంది కదా..అని మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రెస్మీట్ పెట్టారు. మీడియాకు సమాచారం ఇచ్చారు. అయితే… కాసేపటికే.. మళ్లీ టైమింగ్ మార్చారు. ఈ సారి మూడు గంటలకు అన్నారు. ఈ మధ్యలో ఏం జరిగింది..? రాజస్థాన్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ…ఓ ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్నారు. ఆ సభలో వసుంధర రాజే… రైతులకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రకటించారు. ఆ పథకం ప్రకటన కోసమే… ఈసీ తన మీడియా సమావేశాన్ని వాయిదా వేసుకుందన్నమాట. పన్నెండు గంటలకు షెడ్యూల్ ప్రకటిస్తే.. కోడ్ అమల్లోకి వస్తుంది. అది వస్తే…రాజే కొత్త పథకాన్ని ప్రకటించలేరు. ఆహా.. ఈసీ స్వామిభక్తి.. అని అనుకోని వాళ్లు లేరు.
ఇక రెండోది.. తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన. విషయం హైకోర్టులో ఉంది. ఈ విషయాన్ని ఓపీ రావత్ చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్.. తమ తదుపరి ఆదేశాల మేరకు ఉంటుందని హైకోర్టు స్పష్టంగా చెప్పింది. అయినా తాము షెడ్యూల్ మాత్రమే విడుదల చేస్తున్నామని… హైకోర్టులో సమర్థంగా వాదనలు వినిపించి.. సమయానికి జరిగేలా చూసుకుంటామని మాటల్లో తేలిపోయింది. అంత ధీమా చూపించాల్సిన అవసరం ఏమిటి..? ఓటర్ల జాబితాలపై తీవ్రమై ఆరోపణలు చేస్తూ.. ఆధారాలు చూపిస్తున్న ఓ పార్టీ వాదనను.. ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు సరికదా… ఆ పార్టీ కోర్టుకు వెళ్లినా… కోర్టు డైరక్షన్స్ను కూడా పట్టించుకోనంత విధేయత చూపించడం ఎన్నికల సంఘానికి అవసరమా..?
ఇక మూడోది… ఏపీలో ఖాళీ అయిన… పార్లమెంట్ స్థానాల ఉపఎన్నికలు నిర్వహించకపోవడం. ఏపీలో రాజకీయ ఆట ఆడుతున్న బీజేపీ, వైసీపీ… పదిహేను నెలల కిందట ఎంపీలు రాజీనామా చేసినా… ఆమోదించకుండా ఆపారు. ఆ తర్వాత.. ఏడాదికి ఒక్క రోజు తర్వాత ఆమోదింప చేసుకున్నారు. ఈ ఒక్క రోజు కారణంగా.. ఏపీలో ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదని.. ఈసీ చీఫ్.. రావత్ వాదన వినిపించారు. ఓ రాజ్యాంగ బద్ధంగా విధులు నిర్వహించాల్సిన సంస్థకు.. ఇంతకన్నా పతనం ఏముంటుంది….? అందుకే… అందరూ.. బీజేపీనే సూపర్ ఈసీ అంటున్నారు.