కొందరికి తమ మీద తమకు నమ్మకం ఉంటుంది. కొందరికి ఎదుటివారి మీద నమ్మకం ఉంటుంది. ఒక వ్యక్తి వల్ల ఎవరికో మేలు జరిగితే, అతని వల్ల తమకూ మేలు జరుగుతుందని, అతని సహాయం తీసుకోవాలని అనుకుంటారు. జరుగుతుందా లేదా అనే సంగతి తరువాత, ముందైతే ఓ నమ్మకం ఏర్పడుతుంది. దేశంలోని కొన్ని రాజకీయ పార్టీల అధినేతలకు అలాంటి బలమైన నమ్మకం కలిగిస్తున్నాడు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. ఆయనను ఇప్పుడు ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు కదా. రాజకీయ పార్టీలపై, నాయకులపై ‘నమ్మకం’ అనే బలమైన ముద్ర వేశాడు ప్రశాంత్ . అతన్ని వ్యూహకర్తగా పెట్టుకుంటే ఎన్నికల్లో గెలుపు సాధ్యమవుతుందని పార్టీల అధినేతలు అనుకుంటున్నారు. సినిమాల్లో హీరోలకు ఓ ఇమేజ్, క్రేజ్ ఏర్పడినట్లుగా ఎన్నికల రాజకీయాల్లో ప్రశాంత్‌కు ‘హీరో’ ఇమేజ్ ఏర్పడింది. ఇందుకు తాజా ఉదాహరణ వైకాపా అధినేత వైఎస్ జగన్.
వైకాపా ఏపీ ఎన్నికల్లో (అసెంబ్లీ, లోక్‌సభ) ఘన విజయం సాధించడానికి జగన్ ఇమేజ్, చంద్రబాబు నాయుడు వైఫల్యాలు, ఇంకొన్ని కారణాలు దోహదం చేసివుండొచ్చు. కాని ఈ ఘన విజయంలో ప్రశాంత్ కిషోర్ పాత్ర కూడా కీలకమని చెప్పక తప్పదు. ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే ప్రశాంత్ తన బృందంతో వైకాపాకు పనిచేయడం ప్రారంభించాడు. ఈ కృషితోపాటు కాలం కలిసివచ్చి వైకాపా ఘన విజయం సాధించడం, జగన్ ముఖ్యమంత్రి కావడం జరిగిపోయింది. ఈ ఘన విజయం తప్పకుండా దేశంలోని పార్టీల అధినేతల దృష్టికి పోయుంటుంది కదా. దీంతో వచ్చే ఏడాది అంటే 2021లో ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాల్లో పార్టీల అధినేతల చూపు ప్రశాంత్ కిషోర్‌పై పడింది. వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో పశ్చిమ బెంగాల్, అసోం, కేరళ, తమిళనాడు. పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. కొత్త ఏడాదిలో ఈ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల హడావిడి మొదలవుతుంది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు అధినేత మమతా బెనర్జీ ఆల్రెడీ ప్రశాంత్ కిషోర్‌ను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్నారు. ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మమతా బెనర్జీ పార్టీని దారుణంగా దెబ్బతీసింది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే మంచి వ్యూహకర్త కావాలనుకున్న మమత అందుకు ప్రశాంత్ సరైన వ్యక్తి అనుకున్నారు. ఇక తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్ కూడా ప్రశాంత్ కిషోర్‌నే వ్యూహకర్తగా పెట్టుకుంటున్నట్లు సమాచారం. జయలలిత లేని అన్నాడీఎంకే అంత బలంగా ఉండకపోవచ్చు. అయితే జయలలిత లేకపోయినా ఆమె ఇమేజ్ ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది కాబట్టి స్టాలిన్ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్‌ని పెట్టుకోవాలని అనుకుంటున్నాడేమో…!
ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. డీఎంకే, అన్నాడీఎంకే దిగ్గజాలు కరుణానిధి, జయలలిత లేకుండా మొదటిసారిగా వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి. కరుణానిధి వారసుడిగా ఆయన కుమారుడు స్టాలిన్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలని తాపత్రయపడుతున్నాడు. ప్రస్తుత అన్నాడీఎంకే నాయకులతో పోలిస్తే స్టాలిన్‌కు ఎక్కువ ఇమేజ్ ఉంది. అయినప్పటికీ విజయానికి బాటలు వేసే వ్యూహకర్త అవసరమని భావిస్తున్నాడు. ఎవరైనా సరే ఓ పని మొదలుపెట్టేముందు సానుకూల దృక్పథంతోనే ప్రారంభించాలి. ఇతరులకు ఏదైనా పని చేసిపెడుతున్నప్పుడు ఆ పని అప్పగించినవారికి సానుకూల దృక్పథం కలిగించాలి.
వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించాలి. ఉత్సాహం నింపాలి. వాస్తవానికి ఫలితం ఎలా వస్తుందో తెలియదు. కాని ‘గెలుపు మనదే’ అనే ధోరణితోనే ఉండాలి. వైఎస్సార్సీపీ భారీ ప్యాకేజీతో నియమించుకున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగగానే మొదట చేసిన వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం కలిగించడం. వారిలో భరోసా నింపడం. సాధారణ ఎన్నికలకు సుమారుగా రెండేళ్ల ముందు నుంచే పని ప్రారంభించిన ప్రశాంత్ ‘వైసీపీకి గెలుపు అవకాశాలున్నాయి’ అంటూ అంచనా వేయడం పార్టీకి జవసత్వాలనిచ్చింది. అనుకున్నట్లుగానే వైకాపా బ్రహ్మాండమైన విజయం సాధించింది.