ఎన్నికల షెడ్యూల్ విషయంలో భారత ఎన్నికల సంఘం కాస్త ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇప్పటి వరకూ ఎప్పుడూ లేని విధంగా.. తెలుగు రాష్ట్రాలకు ఒకే సారి ఎన్నికలు పెట్టడమే కాదు.. తమిళనాడు సహా పలు కీలక రాష్ట్రాల్లో ఒకే విడతలో ఎన్నికలు పూర్తి చేస్తోంది. దక్షిణాదిలో కర్ణాటకలో మాత్రమే రెండు విడతల ఎన్నికలు జరుగుతాయి. అదే.. బెంగాల్, యూపీ లాంటి రాష్ట్రాల్లో ఏడు విడతల వరకూ పోలింగ్ ఉంది. ఈ షెడ్యూల్ పై చాలా మంది ఎన్నికల నిపుణులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈసీ ఏర్పాట్లు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకున్నా.. గత ఎన్నికల అనుభవాలను చూసినా.. ఇప్పుడు అంతా కాస్త అసాధారణంగానే కనిపిస్తోంది. రాజకీయంగా చూస్తే.. అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి.. ఈ మార్పలని అంచనా వేసుకోవచ్చు.
రాజకీయంగా.. ఈ ఎన్నికల ప్రకటనను చూస్తే భారతీయ జనతా పార్టీ అసలు రేసులో లేని ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఒకే ఒక్క విడతలో.. అదీ కూడా.. తొలి మూడు దశల్లోనే ఎన్నికలు పూర్తి చేస్తున్నారు. బీజేపీకి అసలు అవకాశమే లేని తెలుగు రాష్ట్రాల్లో తొలి విడతలోనే మొత్తం పోలింగ్ పూర్తయిపోతుంది. కర్నాటకలో మాత్రం.. బీజేపీ కాస్త రేసులో ఉంది. అందుకే రెండు విడతలుగా పెట్టారు. అదే తమిళనాడులో… బీజేపీ కూటమి పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. అందుకే.. 39 స్థానాలు ఉన్నప్పటికీ.. అక్కడ పోలింగ్ ఒకే విడతలో పెట్టేశారు. రెండో దశ ఎన్నికల్లో అక్కడ పోలింగ్ ముగుస్తుంది.
ఇక భారతీయ జనతా పార్టీ అత్యధికంగా ఆశలు పెట్టుకుని రాష్ట్రాలు బెంగాల్, బీహార్, యూపీ. ఇక్కడ బీజేపీ ఎదురీదుతోంది. అందుకే… ప్రచారం కోసం విస్త్రృతంగా సమయం కావాలి కాబట్టి.. ఆయారాష్ట్రాల్లో ఏకంగా ఏడు విడతలుగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. బీహార్, బెంగాల్‌లలో 42 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఆ సీట్లకే ఏడు విడతలుగా ఎన్నికలు నిర్వహించడం విశేషం. అలాగే.. బీజేపీ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో చివరి విడతల్లో ఎన్నికలు పెడుతున్నారు. మోడీ విస్త్రతంగా ప్రచారం చేసుకోవడానికి దక్షిణాది రాష్ట్రాలు అడ్డు రాకూడదన్న ఉద్దేశంతో ఇలా మొదటి విడతల్లోనే బీజేపీకి పట్టులేని ప్రారంతాల్లో ఎన్నికలు పూర్తి చేస్తున్నారని రాజకీయవర్గాలు చెబుతున్నాయి.