వచ్చే నెల 21వ తేదీన దేశవ్యాప్తంగా మొత్తం 21 రాజ్యసభ సీట్లు ఖాళీ అవబోతున్నాయి. వాటిలో ఆంధ్రాలో 4, తెలంగాణాలో 2 సీట్లు ఖాళీ అవబోతున్నాయి. ఆంధ్రా నుంచి రాజ్య సభ సభ్యులుగా కొనసాగుతున్న సుజనా చౌదరి, నిర్మాలా సీతారామన్, జెడిశీలం, జై రాం రమేష్, తెలంగాణా నుంచి వి. హనుమంత రావు, గుండు సుధారాణిల పదవీ కాలం జూన్ 21తో ముగియబోతోంది. ఆ స్థానాల భర్తీకి ఎన్నికల షెడ్యూల్ ని ఈవారంలో ప్రకటించి, జూన్ 17లోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయడానికి ఎన్నికల కమీషన్ సన్నాహాలు చేస్తోంది.
ఆంధ్రలో ఆ నాలుగు సీట్ల భర్తీ విషయంలో గత రెండు నెలలుగా చాలా చర్చ, రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యేల సంఖ్యాలం ప్రకారం తెదేపాకి 3, వైకాపాకి ఒక్క రాజ్యసభ సీటు దక్కవలసి ఉంది. కానీ ఆ ఒక్క సీటుని కూడా వైకాపాకు దక్కనీయబోమని నేతలు బహిరంగంగానే చెపుతున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే వైకాపా ఎమ్మెల్యేలను తెదేపాలోకి ఫిరాయింపజేస్తున్నారు. ఇప్పటివరకు మొత్తం 16మంది వైకాపా ఎమ్మెల్యేలు తెదేపాలో చేరారు. ఇంకా ఈ నెలాఖరులోగా కనీసం మరో 15-20 ఎమ్మెల్యేలయినా తెదేపాలో చేరే అవకాశాలున్నట్లు చెపుతున్నారు. అదే కనుక జరిగితే వైకాపా తరపు నుంచి ఒక్కరిని కూడా రాజ్యసభకు పంపే అవకాశం ఉండదు.
ఇంక దీనిపై సమాంతరంగా మరో చర్చకూడా జరుగుతోంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సుజనా చౌదరికి ఈసారి మళ్ళీ రాజ్యసభకి పంపే అవకాశం లేదని, ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. దానిపై తెదేపా అధిష్టానం ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. ఆయనపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ, అవింకా న్యాయస్థానంలో నిరూపించబడవలసి ఉంది. బహుశః అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంతవరకు సుజనా చౌదరికి వ్యతిరేకంగా ఒక్క ముక్క కూడా మాట్లాడలేదనుకొంటే, మళ్ళీ ఆయనకే ఆ స్థానం కేటాయించే అవకాశాలు కనబడుతున్నాయి.
జూన్ 21న పదవీ కాలం ముగిసే ప్రముఖులలో కేంద్ర మంత్రులు ఎం. వెంకయ్య నాయుడు, నిర్మలా సీతారామన్, కాంగ్రెస్ సభ్యులు జైరాం రమేష్, జెడి శీలం, వి.హనుమంత రావు, విజయ మాల్యా తదితరులున్నారు.