అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ను గట్టిగా సమర్థించిన ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి ఆయన విధానాల్లోని లోపాలను వ్యతిరేకించడానికి ఏ మాత్రం సంకోచించడం లేదు. వీరిద్దరూ అక్రమ వలసలకు వ్యతిరేకం. కానీ లీగల్ గా అమెరికాకు వచ్చే వారికి.. ముఖ్యంగా అమెరికాకు ఉపయోగపడేవారిని ఆహ్వానించే విషయంలో ఎలాంటి ఆంక్షలు ఉండకూడదని అంటున్నారు.
H1B వీసాలను పెంచకూడదని, ఇంకా నియంత్రించాలని అనుకుంటున్న డొనాల్డ్ ట్రంప్ విధానంపై మస్క్, వివేక్ వ్యతిరేకత వ్యక్తం చేశారు. అలా చేస్తే అమెరికా గొప్ప ఇంజినీర్లను ప్రొడ్యూస్ చేయలేదని.. గొప్ప టాలెంట్ ను వెదికి పట్టుకోలేదని వారు చెబుతున్నారు. H1B వీసాలను ఇంకా పెంచాలని మంచి ప్రతిభను ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఆకర్షించాలని వీరు అంటున్నారు. H1B వీసాల్లో 70 శాతం భారతీయులకే దక్కుతుంటాయన్న రిపోర్టులు ఉన్నాయి. మల్టీనేషనల్ కంపెనీలు భారతీయు యువతలోని ప్రతిభను గుర్తించి ఈ వీసాలను స్పాన్సర్ చేసి తీసుకెళ్తున్నాయి. ఇప్పుడు వాటిని నియంత్రించాలని ట్రంప్ అనుకుంటున్నారు.
భారతీయుల నైపుణ్యం ఏమిటో ఎలాన్ మస్క్‌కు తెలుసు. వారు రాకపోతే అమెరికా ఎంత నష్టపోతుందో కూడా తెలుసు. వివేక్ రామస్వామికీ తెలుసు. అందుకే వారు హెచ్చరిస్తున్నారు. అయితే ట్రంప్ భావజాలం నిండా నింపుకున్న ఆయన అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. H1B వీసాలతో ఇండియన్స్ అమెరికాకు లక్షల్లో వచ్చేస్తున్నారని వారు అమెరికాను కమ్మేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. వీరు వ్యతిరేకిస్తూంటే.. ట్రంప్ క్యాంప్ లో విధానాలను నిర్దేశించేవారు మాత్రం H1B వీసాలను సమర్థిస్తున్నారు. ఇంకా పెంచాలంటున్నారు.