ఇద్దరు సీరియస్‌గా రింగ్‌లో బాక్సింగ్ చేసుకుంటూంటే.. బయట ఉన్న వాళ్లు పంచ్‌లు విసురుతూ.. అదే తామైతేనా ఇట్టే నాకౌట్ చేసేవాళ్లమని ఊహించుకుంటూ ఉంటారు. అలాంటి వారు రష్యా-ఉక్రెయిన్ పోరులోనూ కనిపిస్తున్నారు. సామాన్యులతే ఎవరూ పట్టించుకోరు.. కానీ ప్రపంచ కుబేరులు కాబట్టి ఇప్పుడు హైలెట్ అవుతున్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న పుతిన్‌ను ..తనతో ఫైట్‌కు రావాలని టెస్లా ఓనర్ ఎలన్ మస్క్ సవాల్చేస్తున్నారు. పుతిన్‌ను ఫేస్ టూ ఫేస్ తేల్చుకుందాం రమ్మంటూ ఎలన్ మస్క్ సవాల్ చేశారు.
అయితే పుతిన్‌కు బదులుగా రష్యా ఆధీనంలోని చెచెన్యా రిపబ్లిక్ హెడ్ స్పందించారు. ” బాక్సింగ్ రింగులో మీరు తలపడితే పుతిన్ దెబ్బకు నీలో ఉన్న దయ్యం ఎగిరిపోతుంది” అంటూ కౌంటర్ ఇచ్చాడు. అంతే కాదు… పుతిన్‌తో తలపడాలంటే చాలా ట్రైనింగ్ కావాలన్నాడు. అప్పుడు పేరు కూడా ఎలన్ నుంచి ఎలానా అని మార్చుకోవచ్చని సలహా ఇచ్చాడు. దీనికి మస్క్ వెంటనే రిప్లయ్ ఇచ్చాటు. అలాంటి శిక్షణ తీసుకోవడానికి రెడీ అని..అప్పుడు తనకు పుతిన్‌ను ఓడించడానికి తన పుర్రచేయి సరిపోతుందన్నారు.
తనది పుర్ర చేయి వాటం కాకపోయినా ఓడిస్తానన్నారు. అంతే కాదు.. చెచెన్ లీడర్ చెప్పినట్లుగా తన ట్విట్టర్ పేరును కూడా మార్చేసుకున్నారు. పరిస్థితి చూస్తూంటే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్‌తో పాటు.. టెస్లాపైనా ఓ కన్నేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేసేప్రకటనల కన్నా ఇప్పుడు మస్క్ చేసే ప్రకటనలే వైరల్ అవుతున్నాయి. రష్యా దెబ్బకు దిబ్బలా మారుతున్న ఉక్రెయిన్‌లో ఇంటర్నెట్ సేవలు ఉన్నాయంటే.. దానికి మస్కే కారణం..తన స్టార్ లింక్ ద్వారా ఇంటర్నెట్ అందిస్తున్నారు.