అహంకారం నెత్తికెక్కితే ఎలాన్ మస్క్ కు అయినా పతనం తప్పదని విధి నిరూపిస్తుంది. ఇప్పుడు అదే జరుగుతోంది. ట్రంప్ ను గెలిపించడానికి ట్విట్టర్ ను వాడేసి..తన సమయాన్ని వెచ్చించిన ఎలాన్ మస్క్.. ఇప్పుడు అమెరికాను డోజ్ పేరుతో ఓ ఆటాడుకుంటున్నారు. ఈ ఆటలో ఆయన ఎంత నష్టపోతున్నారంటే.. ఇంతే కొనసాగితే ఆయన కోలుకోవడం కష్టంగా మారుతుంది.
ఒక్క నెలలోనే ఆయన 180 బిలియన్ డాలర్లకుపైగా సంపద కోల్పోయారు. ఇది 15 లక్షల కోట్ల రూపాయలతో సమానం అనుకోవచ్చు. ఈ ఏడాది జనవరి చివరికి మస్క్ నెట్ వర్త్ 486 బిలియన్ డాలర్లు. ఈ సోమవారం దాని విలువ 301 బిలియన్ డాలర్లు. అంటే నెలన్నర కాక ముందే ఆయన 180 బిలియన్ డాలర్లు నష్టపోయారు. స్పేస్ఎక్స్ హోల్డింగ్లలతో పాటు టెస్లా, ట్విట్టర్, xAI, ది బోరింగ్ కంపెనీ మరియు న్యూరాలింక్లలో భారీగా వాటాలు ఎలాన్ మస్క్ దగ్గరే ఉన్నాయి. వీటి షేర్లు గణనీయంగా పడిపోతున్నాయి.
చైనాకు చెందిన డీప్‌సీక్ AI పరిశ్రమలో సంచలనం సృష్టించిన తర్వాత ఎలాన్ మస్క్ కంపెనీల షేర్లు తగ్గిపోతూ వస్తున్నాయి. టెస్లా ఆటోమొబైల్ కంపెనీ షేర్లు గత నెల రోజులుగా భారీగా పడిపోతూ వస్తున్నాయి. సోమవారం మరింతగా పడిపోయాయి. టెస్లా షేర్ ఈ ఏడాదిలో ఓ రోజు 488 డాలర్లు ఉంది. ఇప్పుడు షేర్ విలువ కేవలం 230 డాలర్లు మాత్రమే. అంటే సగానికి పడిపోయింది.టెస్లా కార్ల అమ్మకాలు కూడా పడిపోతున్నాయి. అందుకే ట్రంప్ తాను టెస్లా కారు కొంటానంటూ ప్రకటించారు. అది ఉపయోగపడుతుందో లేదో చెప్పడం కష్టం. చైనాకు చెందిన బీవైడీ టెస్లా కన్నా మెరుగైన ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీగా మారుతోందన్న అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో బీవైడీ ఇతర దేశాలకు తన నెట్ వర్క్ ను విస్తరిస్తోంది.
ఓ వైపు ఆయన కంపెనీల పనితీరు రోజు రోజుకు దిగజారుతోంది. స్పేస్ ఎక్స్ ఈ మధ్య కాలంలో సరైన విజయం చూడలేదు. అన్నీ వైఫల్యాలే. ఈ పరిస్థితుల్లో ఆయన డోజ్ ను వదిలేసి వ్యాపారాలు చూసుకుంటే తప్ప బాగుపడే పరిస్థితి కనిపించడం లేదు. మరి మస్క్ ఏం చేస్తారో ?